CJP Protest: దిల్లీలో ఉద్రిక్తత.. మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ విపక్ష నేతల అరెస్ట్!

CJP Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ దిల్లీలో చేపట్టిన నిరసనల వేళ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, యోగేంద్ర యాదవ్ తదితర విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 10 Oct 2026 4:57 PM IST
CJP Protest
X

CJP Protest: దిల్లీలో ఉద్రిక్తత.. మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ విపక్ష నేతల అరెస్ట్!

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) మరియు 'ఇండియా' కూటమి పిలుపునిచ్చిన నిరసనలతో దిల్లీ అట్టుడుకుతోంది. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించగా, దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీజేపీకి మద్దతుగా ఆందోళనలకు దిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు జాతీయ స్థాయి విపక్ష నేతలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సౌత్ అవెన్యూలోని ఒక బస్టాప్ వద్ద నిరసన తెలుపుతున్న మమతా బెనర్జీని, ఆమె పార్టీ నేతలు డెరెక్‌ ఓబ్రియన్‌, డోలా సేన్‌లను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు.

ఐఎఎన్ఏ (INA) మార్కెట్ వద్ద నిరసన తెలుపుతున్న ఏఐఎస్‌ఏ చీఫ్‌ నేహా బోరా, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ జాతీయ కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్యతోపాటు ప్రముఖ సామాజిక కార్యకర్తలు ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్ర యాదవ్‌లను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఆకాశవాణి, జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేస్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అక్కడ స్వల్ప ఉద్రిక్తత, రాళ్ల దాడి జరిగినట్లు సమాచారం. దీంతో సెంట్రల్ దిల్లీ వ్యాప్తంగా ఆంక్షలు కఠినతరం చేశారు. తుగ్లక్‌ రోడ్డు పోలీస్‌ స్టేషన్‌లోని ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్సిస్తున్నారు.

సీజేపీ ఆందోళనలకు మద్దతుగా చండీగఢ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేపట్టిన నిరసనలో పాల్గొన్న మనీశ్‌ సిసోదియాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే శ్రీనగర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు చేపట్టిన ర్యాలీలను పోలీసులు భగ్నం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.