Delhi High Court: 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతాను పునరుద్ధరించండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆర్డర్!

Delhi High Court: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాపై విధించిన నిషేధాన్ని తక్షణమే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Arun Chilukuri
Published on: 7 July 2026 4:28 PM IST
Delhi High Court
X

Delhi High Court: 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతాను పునరుద్ధరించండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆర్డర్!

Delhi High Court: సోషల్ మీడియా వేదికగా విభిన్న పొలిటికల్ క్యాంపెయిన్‌తో గుర్తింపు తెచ్చుకున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) కి న్యాయస్థానంలో ఊరట లభించింది. సీజేపీకి చెందిన అధికారిక 'ఎక్స్' ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీట్ పరీక్షల వివాదం ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ నిర్వహణ సమయాల్లో ఈ 'ఎక్స్' ఖాతా ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో తీవ్ర గందరగోళం, అలజడి సృష్టించే అవకాశం ఉందనే గట్టి కారణంతోనే తాము ఆ పార్టీ ఖాతాపై నిషేధం విధించాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి వివరించారు. అయితే, ప్రస్తుతం నీట్ పరీక్షల ప్రక్రియ ఇప్పటికే పూర్తిగా ముగిసినందున, ఇకపై ఆ అకౌంట్‌ను నిలిపి ఉంచాల్సిన అవసరం లేదని భావించిన హైకోర్టు, తక్షణమే నిషేధాన్ని తొలగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

తమ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాను పునరుద్ధరించాలంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాము సోషల్ మీడియాలో అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కేవలం వారం రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తమ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేసిందని అభిజిత్ దీప్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసే సమయానికి దానికి దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని, అలాగే తాము 'సీజేపీ' పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నామని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు తాజా తీర్పుతో కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story