Delhi Health Alert: గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. ప్రమాదకర స్థాయికి పడిపోయిన గాలి నాణ్యత

దీపావళి పండుగ వేళ ఢిల్లీలో ఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. గాలి నాణ్యత పడిపోవడంతో నగరమంతా గ్యాస్ ఛాంబర్‌లా మారింది.

CR Reddy
Published on: 8 Nov 2026 9:22 AM IST
Delhi Health Alert
X

Delhi Health Alert

Delhi Health Alert: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పటాకులు కాల్చే సమయంలో జరిగే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అన్ని ప్రధాన ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లాస్టిక్ సర్జరీ, బర్న్, ఎమర్జెన్సీ విభాగాలలో ప్రత్యేక బెడ్లను రిజర్వ్ చేశారు. డాక్టర్లు, సిబ్బంది సెలవులను రద్దు చేసి ప్రత్యేక రోస్టర్ పద్ధతిలో విధులకు కేటాయించారు. ఒకవేళ బాధితుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగితే వెంటనే వైద్య సేవలు అందించేలా ఆసుపత్రుల యంత్రాంగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.

గ్యాస్ ఛాంబర్‌గా మారిన రాజధాని

ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ కోరలు చాచుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) గణాంకాల ప్రకారం నగరంలో సగటు AQI 364 నుంచి 369 మధ్య నమోదైంది. కొన్ని ప్రాంతాలలో ఇది ఏకంగా 400 దాటి తీవ్రమైన ప్రమాదకర స్థాయికి చేరింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తీవ్ర కాలుష్య వాతావరణం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఆరోగ్య ముప్పును ఎదుర్కొంటున్నారు.

కాలిన గాయాలపై ఇంటి చికిత్సలు డేంజర్

పటాకులు కాల్చేటప్పుడు ఎవరైనా కాలిపోతే వెంటనే కొన్ని పొరపాట్లు చేస్తుంటారని డీడీయూ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ డాగర్ తెలిపారు. చాలా మంది గాయాలపై టూపేస్ట్, బంగాళాదుంప గుజ్జు, మంచు లేదా నూనె రాస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమని, దీనివల్ల చర్మం మరింత దెబ్బతిని ఇన్‌ఫెక్షన్ ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రి డాక్టర్ సూచిస్తూ.. కాలిన వెంటనే ఆ భాగాన్ని కనీసం 10 నుంచి 20 నిమిషాల పాటు సాధారణ కుళాయి నీటి కింద ఉంచాలని చెప్పారు.

ఏం చేయాలి? ఏమి చేయకూడదు?

కంటి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం పటాకుల బారూదు కళ్లలో పడితే కార్నియా, రెటినా తీవ్రంగా దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కళ్లలో గాయాలైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి తప్ప సొంత వైద్యం చేసుకోకూడదు.

* ఏం చేయాలి: కాలిపోయిన చోట చల్లని నీటిని పారించాలి. శుభ్రమైన గుడ్డతో కప్పి ఉంచాలి. నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

* ఏం చేయకూడదు: నేరుగా మంచు ముక్కలను రుద్దకూడదు. టూపేస్ట్, పసుపు, వంటనూనెలు పూయకూడదు. సింథటిక్ బట్టలకు బదులుగా కాటన్ వస్త్రాలు ధరించాలి.

నిపుణుల సలహాలు

ప్రముఖ వైద్యులు ఇస్తున్న సూచనల ప్రకారం కాలుష్య ప్రభావం నుంచి కాపాడుకోవడానికి ప్రజలు కొన్ని నియమాలు పాటించాలి. డాక్టర్లు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు మూసి ఉంచి నాణ్యమైన ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా N95 మాస్క్ ధరించాలని తెలిపారు. అలాగే డాక్టర్ రామ్‌దీప్ గులేరియా ఉదయం, సాయంత్రం వేళల్లో బయట తిరగవద్దని సూచించారు. స్వీట్లు మితంగా తింటూ, పండగ వేళ ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.