Delhi High Court: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. మూడు వారాలే గడువు!

Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆ పార్టీ కీలక నేతలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Arun Chilukuri
Published on: 17 Nov 2026 2:53 PM IST
Delhi High Court
X

Delhi High Court: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. మూడు వారాలే గడువు!

Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆ పార్టీ కీలక నేతలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటివరకు సమాధానాలు దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, చివరిసారిగా మూడు వారాల సమయం ఇచ్చింది. ఈలోగా సమాధానాలు సమర్పించకపోతే తమ వాదనలు వినిపించే హక్కును కోల్పోతారని కఠినంగా హెచ్చరించింది.

మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అరుణ్ భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం ఆప్ నేతల తీరుపై మండిపడింది. కేసుకు సంబంధించిన పత్రాలు తమకు అందలేదని నేతల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, కోర్టు రిజిస్ట్రీ నుంచి అందిన నివేదిక ప్రకారం అవసరమైన పత్రాల పంపిణీ ఎప్పుడో పూర్తయిందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర స్వరంతో స్పందిస్తూ.. ‘‘మమ్మల్ని ఆటపట్టిస్తున్నారా? ఇకపై మీకు సమయం ఇవ్వబోం. తక్షణమే సమాధానాలు దాఖలు చేయండి.. లేకపోతే ఆ హక్కును మూసివేస్తాం’’ అంటూ హెచ్చరించింది.

అసలు ఈ కోర్టు ధిక్కరణ కేసు ఏంటి?

ఢిల్లీ మద్యం విధానం కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితర నిందితులను ట్రయల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ (CBI) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్న సమయంలో.. ఆమె విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ కేజ్రీవాల్, సిసోడియా తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే న్యాయమూర్తి ఆ అభ్యర్థనలను తిరస్కరించారు. దీంతో ఆప్ నేతలు ఆమె ఎదుట వ్యక్తిగతంగా గానీ, న్యాయవాదుల ద్వారా గానీ హాజరుకాబోమని లేఖలు రాశారు. అంతేకాకుండా జస్టిస్ స్వర్ణకాంత శర్మపై సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోల నేపథ్యంలో న్యాయస్థానం కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది.

కేసులో ఉన్న ప్రముఖులు వీరే:

ఈ కోర్టు ధిక్కరణ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, దుర్గేశ్ పాఠక్, వినయ్ మిశ్రా, దేవేష్ విశ్వకర్మ తదితరులు ఉన్నారు. కోర్టు ఇచ్చిన చివరి మూడు వారాల గడువులోగా వీరు సమాధానాలు దాఖలు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.