Delhi: అర్ధరాత్రి కేఫ్‌లో దారుణం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్!

Delhi: తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ కేఫ్‌లో జరిగిన పార్టీలో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

Arun Chilukuri
Published on: 25 Nov 2026 2:25 PM IST
Delhi
X

Delhi: అర్ధరాత్రి కేఫ్‌లో దారుణం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కేఫ్‌లో జరిగిన పార్టీ సందర్భంగా 22 ఏళ్ల యువతిపై తోటి సహోద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలతో సహా మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు (22) ప్రీత్ విహార్‌లోని ఒక కేఫ్‌లో పనిచేస్తోంది. సోమవారం రాత్రి ఆ కేఫ్‌లో నిర్వహించిన పార్టీకి ఆమెతో పాటు ఇతర సిబ్బంది హాజరయ్యారు. రాత్రి సుమారు 11:30 గంటలకు కేఫ్‌ను మూసివేశారు. అయితే, ఉద్యోగుల్లో ఒకరి వద్ద తాళాలు ఉండటంతో వారు తిరిగి కేఫ్‌ను తెరిచి లోపలే పార్టీ కొనసాగించారు.

కేఫ్ లోపల మద్యం సేవిస్తూ, నృత్యం చేస్తూ గడిపిన సమయంలో.. ఇద్దరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, మిగిలిన సహోద్యోగులు ఈ నేరానికి సహకరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు పార్టీ సాగినట్లు సమాచారం.

బాధితురాలు మంగళవారం తెల్లవారుజామున 5:45 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. అంతకుముందు, తెల్లవారుజామున కేఫ్ నుంచి బాధితురాలు ఒక పురుష స్నేహితుడు, మరో ఇద్దరు మహిళలతో కలిసి వాహనంలో వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, త్వరలోనే మేజిస్ట్రేట్ ముందు కూడా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ ఘటన ఢిల్లీలో మహిళా భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.