Delhi Rapido incident: రాపిడో డ్రైవర్ దారుణం..రన్నింగ్ బైక్‌పై నుంచి దూకేసిన యువతి..!

Delhi Rapido incident: నిర్మానుష్య దారిలోకి బైక్ తీసుకెళ్లడంతో భయాందోళనకు గురై రన్నింగ్ రాపిడో బైక్ నుంచి దూకేసిన ఢిల్లీ యువతి. డ్రైవర్ సస్పెన్షన్, పోలీసుల విచారణ.

Naresh.k
Published on: 15 Aug 2026 12:55 PM IST
Delhi Rapido incident
X

Delhi Rapido incident: రాపిడో డ్రైవర్ దారుణం..రన్నింగ్ బైక్‌పై నుంచి దూకేసిన యువతి..!

Delhi Rapido incident: Rapido bike : దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం లక్షలాది మంది ఆధారపడే యాప్ ఆధారిత రవాణా సేవలు మహిళలకు ఎంతవరకు సురక్షితం అనే అనుమానాలను మరో తీవ్రమైన ఘటన రేకెత్తించింది. నిర్మానుష్య మార్గంలోకి బైక్‌ను తీసుకెళ్తుండటంతో ప్రాణభయంతో ఊగిపోయిన ఓ యువతి కదులుతున్న రాపిడో బైక్ నుంచి కిందకు దూకేసింది. ఆఫీసుకు సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఆ యువతి రాపిడో బైక్ రైడ్‌ను బుక్ చేసుకుంది. అయితే, ప్రయాణం మొదలైన కొంతసేపటికే డ్రైవర్ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది.

ఆఫీసుకు రోజూ వెళ్లే సాధారణ మార్గాన్ని కాదని, డ్రైవర్ బైక్‌ను నిర్మానుష్యంగా, చీకటిగా ఉన్న ఒక అనుమానాస్పద దారిలోకి తీసుకెళ్లాడు. రూట్ మారడాన్ని గమనించి ప్రశ్నించిన యువతికి.. యూనివర్సిటీ వైపు వెళ్లేందుకు ఇదే సరియైన దారంటూ డ్రైవర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

అనుమానం బలపడటంతో బైక్ వెంటనే ఆపాలని యువతి ఎంత వేడుకున్నా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ప్రమాదాన్ని ముందే ఊహించిన ఆ యువతి, ప్రాణాలను పణంగా పెట్టి కదులుతున్న బైక్ నుంచి కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో యువతి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం అనంతరం బాధితురాలు రాపిడో కస్టమర్ కేర్‌ను సంప్రదించగా, వారి నుంచి ఎలాంటి తక్షణ స్పందన లేదా సాయం లభించలేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అత్యవసర సమయంలో కంపెనీ చూపిన నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ వివాదం తీవ్రం కావడంతో స్పందించిన రాపిడో సంస్థ, సంబంధిత డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, రోజురోజుకూ పెరుగుతున్న యాప్ ఆధారిత రవాణా సేవల్లో మహిళలకు రక్షణ ఏదీ? అత్యవసర పరిస్థితుల్లో స్పందించే SOS ఫీచర్లు నిజంగా పనిచేస్తున్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. బాధితురాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ, ఈ ఘటన ప్రయాణికులలో తీవ్ర భయాందోళనలను నింపింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story