Delhi: రూ.32లకే కిలో ఉల్లి - మంత్రి నాదెండ్ల మనోహర్
Delhi: రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా రూ.32లకే కిలో ఉల్లి అందిస్తామని, చౌకడిపోల ద్వారా రాయితీపై కందిపప్పు, పామాయిల్ ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Delhi: రూ.32లకే కిలో ఉల్లి - మంత్రి నాదెండ్ల మనోహర్
న్యూఢిల్లీ: బహిరంగ మార్కెట్ లో నిత్యావసర ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంచేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కిలో ఉల్లి పాయలను రూ.32లకే అందించేందుకు సిద్ధమవుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 115 రైతు బజార్లు, అలాగే మొబైల్ కౌంటర్ల ద్వారా ప్రజలందరికీ ఉల్లి రాయితీ ధరకే అందిస్తామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
కేంద్ర పౌర సరఫరాల శాఖ, నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.సి.సి.ఎఫ్.) అధికారులతో జరిగిన వరుస భేటీల్లో రాష్ట్రానికి రాయితీ ధరల్లో ఉల్లిని, కందిపప్పు, పామాయిల్ ను అందించేందుకు అధికారులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ ఎల్ నినో పరిస్థితుల పేరు చెప్పి, ఇతరత్ర కారణాలతో బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగిన మాట వాస్తవమే. ఇలాంటి సమయాల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచేలా పనిచేస్తున్నాం. ముఖ్యంగా నిత్యావసర ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడాం. కేంద్ర ధరల స్థిరీకరణ నిధులు (పి.ఎస్.ఎఫ్) లతో రాయితీపై కిలో ఉల్లిపాయలు రూ.32లకే వచ్చే వారం నుంచి రాష్ట్ర ప్రజలకు అందించేందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలోని రైతు బజార్లతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించిన విధంగా మొబైల కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను తక్కువ ధరలకే రాష్ట్రంలో విక్రయిస్తాం. ఉల్లిపాయలతో పాటు కందిపప్పును రాయితీపై 1.20 లక్షల మెట్రిక్ టన్నులు, పామాయిల్ 86,400 కిలో లీటర్ల పామాయిల్ ను రాయితీ ధరలకే రాష్ట్రంలోని 1.46 లక్షల కుటుంబాలకు చౌకధరల డిపోల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తాం. బహిరంగ మార్కెట్ ధరల కంటే 30 శాతం తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరకులు అందుకోవడం సామాన్యులకు ఊరటనిస్తుంది. కిలో కందిపప్పు ప్రతి కార్డుదారుడికి అందిస్తాం. కేంద్ర ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకొని రాష్ట్రానికి తగిన విధంగా సహకరిస్తున్న కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
రాష్ట్ర నమూనా దేశానికే మోడల్ అయింది
చౌక డిపోల ద్వారా ప్రజలకు అందించే బియ్యంలో నూకలు 10 శాతానికి తగ్గించి ఇవ్వడం ద్వారా బియ్యం వినియోగం పెరుగుతుందని భావించి, ఆ విధానాన్ని రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలు చేశాం. దీన్ని కేంద్రం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజా పంపిణీలో అమలు చేసేలా వచ్చే నెల నుంచి ఆదేశాలు ఇవ్వనుంది. బియ్యం వినియోగం పెంచడానికి రాష్ట్రంలో అనుసరించిన మార్గాన్ని కేంద్రం అమలు చేయడం రాష్ట్రానికి గర్వకారణం. 30 ఏళ్ల పీడీఎస్ బియ్యం పంపిణీ వ్యవస్థలో ఇదో పెద్ద మార్పు కింద భావించాలి. రాష్ట్ర ప్రభుత్వ సమర్దంగా అమలు చేస్తున్న విధానం దేశమంతటికీ ఆదర్శం కావడం ఆనందంగా ఉంది. ప్రజా పంపిణీ మరింత బలోపేతం అయ్యేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రణాళిక సిద్ధం
వినియోగదారులకు తక్కువ ధరలకే సరకులను అందించేందుకు ఏర్పాటు చేస్తున్న 1000 మీ మార్టులను ఎన్.సి.సి.ఎఫ్.తో అనుసంధానం అయి మొదలుపెడుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి. మరో 130 మీ మార్టులు సిద్ధమైతే, గౌ.ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటిని రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో ప్రారంభిస్తాం. నాణ్యతమైన సరకులు, తక్కవ ధరల్లోనే అందించేలా మీ మార్టులు పనిచేస్తాయి. దీంతో పాటు వచ్చే ఖరీఫ్ నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి పౌర సరఫరాల శాఖ తన ప్రణాళికను సిద్ధం చేసింది. వచ్చే ఖరీఫ్ లో రాష్ట్రంలో 35 నుంచి 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా సన్నద్ధం అవుతున్నాం. రికార్డు స్థాయిలో 24 గంటల్లోపే ధాన్యం సొమ్ములు అందించిన రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని కొనసాగించేలా, రైతులకు అండగా నిలిచేందుకు సమాయత్తం అవుతోంది’’ అని చెప్పారు.




