Road Accident : ఘోర ప్రమాదం..ఆరుగురు సజీవ దహనం, 17 మందికి తీవ్ర గాయాలు

Road Accident : ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా వద్ద బస్సు, ట్రక్కు ఢీకొని మంటలు చెలరేగడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

CR Reddy
Published on: 1 July 2026 7:04 AM IST
Delhi Mumbai Expressway Accident
X

Delhi Mumbai Expressway Accident

Road Accident : ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజస్థాన్‌లోని దౌసా జిల్లా, కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారాపుర సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక స్లీపర్ బస్సు, వేగంగా వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత ధాటిగా జరిగిందంటే, ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే బస్సు, ట్రక్కు పూర్తిగా అగ్నిగోళాలుగా మారిపోయాయి. ఈ అత్యంత విషాదకరమైన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమవగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

నిద్రమత్తే కొంపముంచిందా?

ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే దౌసా ఎస్పీ పియూష్ దీక్షిత్ భారీ పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బస్సు డ్రైవర్‌కు నిద్రమత్తు వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే, ప్రమాద సమయంలో బస్సు చాలా మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్లీపర్ బస్సు ఎక్కడి నుంచి వస్తోంది, ఎటు వైపు వెళ్తోంది అనే పూర్తి వివరాలను సేకరించే పనిలో కొల్వా పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఎక్స్‌ప్రెస్‌వేపై అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

గంటపాటు బస్సులోనే నరకయాతన

ఈ ప్రమాద సమయంలో కళ్లారా చూసిన స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు జిల్లా యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున దాదాపు 3:20 గంటల ప్రాంతంలోనే ప్రమాదం జరిగినట్లు తాము స్థానిక పోలీసులకు, ఎక్స్‌ప్రెస్‌వే మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించామని గ్రామస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ అంబులెన్స్, ఫైర్ బ్రిగెడ్ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకోవడంలో తీవ్ర ఆలస్యం చేశాయని ఆరోపించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రాకపోవడంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు ఒక గంట పాటు ప్రయాణికులు బస్సు లోపలే చిక్కుకుపోయి ప్రాణాల కోసం అరుపులు, కేకలు వేశారు. చివరికి స్థానిక ప్రజలే ధైర్యం చేసి బస్సు కిటికీలు, తలుపులు పగలగొట్టి లోపల చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. బస్సు లోపల మరికొంతమంది ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

గ్రీన్ కారిడార్ ద్వారా ఆసుపత్రికి తరలింపు

తీవ్రంగా గాయపడిన పదిహేడు మంది ప్రయాణికులను త్వరగా ఆసుపత్రికి చేర్చడం కోసం జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసింది. ఏ విధమైన ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షతగాత్రులను అత్యంత వేగంగా దౌసా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి వద్ద ఏఎస్పీ యోగేంద్ర ఫౌజ్దార్ నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా డాక్టర్ల బృందాన్ని అలర్ట్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో, మృతులతో పాటు గాయపడిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story