Heavy Rains: ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు: 24 గంటల్లో 200 మి.మీ వర్షపాతం!
Delhi Mumbai Weather Updates: దేశవ్యాప్తంగా రుతుపవనాల జోరు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీని నైరుతి రుతుపవనాలు తాకగా.. ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి.
Heavy Rains: ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు: 24 గంటల్లో 200 మి.మీ వర్షపాతం!
Delhi Mumbai Weather Updates: దేశ రాజధాని ఢిల్లీతో పాటు భారత ఆర్థిక రాజధాని ముంబయి నగరాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల విస్తరణ వేగవంతం కావడంతో రెండు మెట్రో నగరాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ముంబయిలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది.
ముంబయి నగరంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దాదర్, పార్లే, హింద్‌మాతా, చార్‌కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరీ వంటి కీలక పల్లపు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముంబయి నగర జీవనరేఖ అయిన లోకల్ రైళ్ల సర్వీసులపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. చాలా చోట్ల రైల్వే పట్టాలు నీట మునగడంతో లోకల్ రైళ్లు షెడ్యూల్ సమయం కంటే గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.
గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ముంబయి నగరం మరియు దాని శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. వానలతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాగే, గురువారం రాత్రి సముద్రంలో హైటైడ్ (High Tide) కారణంగా అలలు ఏకంగా 4.27 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ఢిల్లీని తాకాయి. సాధారణంగా రావాల్సిన సమయం కంటే ఈసారి ఐదు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ఢిల్లీకి చేరుకున్నాయి. వీటి ప్రభావంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాబోయే 24 గంటల్లో నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ స్పష్టం చేసింది.




