Delhi Heavy Rain : ఢిల్లీకి వర్ష బీభత్సం.. రెడ్ అలర్ట్‌తో హై అలర్ట్..
Delhi Heavy Rain : ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని కుండపోత వర్షాలకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు..
Delhi Rains
Delhi Heavy Rain : ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని కుండపోత వర్షాలకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాజధానితో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కాలువలను తలపిస్తూ జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై కొన్ని అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో వాహనాలు చిక్కుకుపోయాయి. జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉదయాన్నే ఆఫీసులకు, పనులకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జాతీయ రహదారి NH-48పై భారీ ట్రాఫిక్ జామ్
గురుగ్రామ్ పరిధిలో కురిసిన వర్షాలకు పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. నరసింగ్‌పూర్ ప్రాంతంలోని నేషనల్ హైవే (NH-48) పై వర్షపు నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలు దారుణంగా నెమ్మదించాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే నరకం అనుభవించారు. ఢిల్లీ వ్యాప్తంగా ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి రెట్టింపు సమయం పట్టింది.
ఆసుపత్రుల ప్రాంగణాలు, మెయిన్ రోడ్లలో నిలిచిన నీరు
వర్షాల ధాటికి రాజధానిలోని కీలక ప్రాంతాలు, ఆసుపత్రుల సమీప మార్గాలు నీట మునిగాయి. ఢిల్లీలోని ప్రముఖ ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రి సమీపంలో భారీగా నీరు నిలిచిపోవడంతో రోగులు, వాహనదారులు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రి పరిసరాల్లో రహదారులు చెరువులను తలపించడంతో నిలిచిన నీటిలోనే వాహనాలు ప్రయాణించాల్సి వచ్చింది. బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో భారీగా నీరు చేరడంతో అనేక వాహనాలు నీటిలోనే ఆగిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మోతీ బాగ్ ఏరియాలో కూడా రోడ్లు జలమయం కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి.
కాలనీల్లోకి చేరిన వర్షపు నీరు.. విమానాశ్రయ మార్గాల్లో అంతరాయం
నగరంలోని కర్కోలా ప్రాంతంలో వర్షపు నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో స్థానిక నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఏపీఎస్ కాలనీతో పాటు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌తో సహా ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా జలమయమయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులు నీటితో నిండిన రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’
నగరంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ (IMD) దేశ రాజధానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' ప్రకటిస్తూ, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది. రానున్న గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది. నీరు నిలిచే ప్రాంతాల పట్ల ప్రజలు , వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.




