Delhi Red Alert : మళ్లీ ఢిల్లీకి రెడ్ అలర్ట్.. వానల బీభత్సం..
Delhi Red Alert : దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాన్ని వర్షాలు అస్సలు వదలడం లేదు. నిన్న కురిసిన కుండపోత వర్షం సృష్టించిన బీభత్సం నుంచి నగరవాసులు ఇంకా
Delhi rain alert
Delhi Red Alert : దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాన్ని వర్షాలు అస్సలు వదలడం లేదు. నిన్న కురిసిన కుండపోత వర్షం సృష్టించిన బీభత్సం నుంచి నగరవాసులు ఇంకా తేరుకోకముందే, ఆదివారం కూడా దట్టమైన మేఘాలు కమ్ముకుని వర్షం దంచికొడుతోంది. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ , పరిసర ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచే వర్షపాతం నమోదవుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ (IMD), ఢిల్లీలోని పలు ప్రాంతాలకు అత్యవసరంగా 'రెడ్ అలర్ట్' జారీ చేయగా, మరికొన్ని ప్రాంతాలకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది.
ఆందోళన కలిగిస్తున్న రెడ్ అలర్ట్ హెచ్చరికలు
వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. షాదారా, సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ , నార్త్ ఢిల్లీ పరిధిలోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రెడ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, చెట్ల కింద లేదా శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఆశ్రయం పొందవద్దని యంత్రాంగం సూచించింది.
వేడి నుంచి ఉపశమనం.. ట్రాఫిక్ స్లో
గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఉక్కపోత, వేడితో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షాలు పెద్ద ఊరటనిచ్చాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో వాతావరణం చల్లబడింది. అయితే, మరోవైపు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల వేగానికి పూర్తిగా బ్రేకులు పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఐతే, ఈ రోజు ఆదివారం వీకెండ్ కావడం వల్ల ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల రద్దీ లేక ట్రాఫిక్ జామ్‌ల ప్రభావం కొంతవరకు తగ్గింది.
శనివారం నాటి కుండపోత.. రికార్డు స్థాయిలో విమానాలు డిలే
శనివారం ఎన్‌సిఆర్ వ్యాప్తంగా పడిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఈ తీవ్ర ప్రతికూల వాతావరణం ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై తీవ్రమైన ప్రభావం చూపింది. విజిబిలిటీ తగ్గడం , ఈదురుగాలుల కారణంగా శనివారం రోజు ఏకంగా 200కు పైగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీకి చేరుకోవాల్సిన విమానాలు సగటున 70 నిమిషాలు, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు టేకాఫ్ కావాల్సిన విమానాలు దాదాపు 130 నిమిషాల వరకు డిలే అయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర అవస్థలు పడ్డారు.
అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది
రాబోయే కొన్ని గంటల్లో వర్షం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) , ఎన్‌సిఆర్ పరిధిలోని స్థానిక యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. నీరు నిలిచే ప్రధాన కడప ప్రాంతాల్లో వాటర్ పంపులను ఏర్పాటు చేసి నీటిని తోడేందుకు చర్యలు చేపట్టారు. నగరవాసులు తాజా వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ, ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.




