Police FRS System: జైల్లో ఉన్న ఖైదీలు ధర్నాలో ప్రత్యక్షం.. పోలీసుల నిఘా వ్యవస్థ అట్టర్ ప్లాప్

Police FRS System: జంతర్ మంతర్ ధర్నాలో ఉన్నారని కెమెరాలు గుర్తించిన 25 మంది నేరస్థులు ఆ సమయానికి జైల్లోనే ఉండటం గమనార్హం.

CR Reddy
Published on: 4 Sept 2026 7:56 AM IST
Police FRS System
X

Police FRS System

Police FRS System: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనలో ఢిల్లీ పోలీసులు ఉపయోగించిన ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ (ఎఫ్ఆర్ఎస్) తీవ్రంగా విఫలమైంది. నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారంటూ ఈ కెమెరా వ్యవస్థ గుర్తించిన నేరస్థుల్లో కనీసం 25 మంది ఆ సమయంలో జైలు గోడల వెనుకే బంధీలై ఉన్నారని పరిశోధనలో తేలడం సంచలనం సృష్టిస్తోంది. జూలై మాసంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో విద్యార్థుల నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత అధునాతనమైన ముఖ గుర్తింపు సాంకేతికతను (ఎఫ్ఆర్ఎస్) రంగంలోకి దించారు. ఈ వ్యవస్థ ద్వారా రికార్డు చేసిన విజువల్స్ ఆధారంగా మొత్తం 2,873 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ధర్నా ప్రాంతంలో సంచరించినట్లు పోలీసులు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆటోమేటిక్ విశ్లేషణ ద్వారా నేరగాళ్లను పట్టుకోవడానికే ఈ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.

ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ దిగ్భ్రాంతికర నిజాలు

పోలీసులు సుప్రీంకోర్టుకు అందజేసిన జాబితాను ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ప్రతినిధి క్షుణ్ణంగా పరిశీలించారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న 205 మంది రికార్డులను తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. అందులో హత్య, హత్యాయత్నం, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదైన వారి డేటాను సరిపోల్చారు. ఫలితంగా ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఆందోళన స్థలంలో ఉన్నట్లు గుర్తించిన వారిలో 25 మంది నిందితులు సరిగ్గా ఆ సమయానికి తిహార్, మండోలి, రోహిణి జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

జైల్లో ఉన్న నిందితులు ఆందోళనలో ఎలా ఉంటారు?

ఆందోళన ముగిసే చివరి రోజుల్లో ఈ గుర్తింపు ప్రక్రియ జరిగింది. హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న 17 మంది, అత్యాచారం కేసులలో ఉన్న 4 మంది, తీవ్రమైన గాయాల కేసులకు సంబంధించి నలుగురు జైలు గదుల్లోనే ఉన్నప్పటికీ కెమెరా మాత్రం వారు ధర్నా చౌక్‌లో తిరుగుతున్నట్లు రిపోర్టు ఇచ్చింది. గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన జిమ్ యజమాని హత్య కేసులో అరెస్టయిన నిందితుడు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నాడని ఈ సాంకేతికత తేల్చడం గమనార్హం.

పోలీసుల వివరణ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ వివాదంపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ కేవలం కెమెరా ప్రాథమికంగా ఇచ్చిన సమాచారంతోనే ఎవరిపైనా చర్యలు తీసుకోమని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు స్వయంగా పరిశీలించి ధృవీకరించిన తర్వాతే ఆ వ్యక్తి నిరసనలో పాల్గొన్నాడో లేదో తేలుస్తామని వివరణ ఇచ్చారు. కాగా విద్యార్థుల నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసిన సుప్రీంకోర్టు, క్రిమినల్ రికార్డులు ఉన్న ఆ 2,873 మంది విషయమై చట్టప్రకారం ముందుకు వెళ్లవచ్చని ఆదేశించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story