NEET Protest : నీట్ ఆందోళన వెనుక 2,873 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్.. ఢిల్లీ పోలీసుల షాకింగ్ నివేదిక
NEET Protest : నీట్ పేపర్ లీక్‌పై జరిగిన నిరసనల్లో 2,873 మంది క్రిమినల్స్ పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసుల ఎఫ్‌ఆర్‌ఎస్ డేటాలో వెల్లడైంది.
NEET Protest
NEET Protest : నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా, పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే నిరసనకారులు చేసిన హింసాత్మక దాడుల్లో పలువురు పోలీసు సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆందోళనలు ముగియడంతో, అందులో పాల్గొన్న నిరసనకారుల పాత క్రిమినల్ రికార్డులను తవ్వితీసే పనిలో ఢిల్లీ పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన దర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.
FRS కెమెరాల్లో చిక్కిన 2,873 మంది క్రిమినల్స్
ఢిల్లీ పోలీసులు అమర్చిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాల డేటా ప్రకారం.. ఈ నిరసన ప్రదర్శనలో ఏకంగా 2,873 మంది పాత నేరస్థులు పాల్గొన్నట్లు తేలింది. వీరంతా గతంలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు వంటి అత్యంత తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉన్నవారే కావడం గమనార్హం. నార్త్ ఈస్ట్ ఢిల్లీ (జాఫ్రాబాద్, చాంద్ బాగ్, సీలంపూర్), సౌత్ ఈస్ట్ (జామియా, షాహీన్ బాగ్, ఓఖ్లా) మరియు సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాలకు చెందిన పాత ముఠాలే ఈ ఆందోళనల్లో ప్రధానంగా విధ్వంసం సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు.
989 మందిపై ఘోరమైన నేరాల రికార్డులు
పోలీసులు వెల్లడించిన రికార్డుల ప్రకారం.. ఆందోళనల్లో పట్టుబడిన 2,873 మందిలో 989 మందిపై అతి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఇందులో 101 మంది హత్య కేసుల్లో, 62 మంది హత్యాయత్నం కేసుల్లో, 284 మంది దోపిడీ లేదా లూటీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వీరే కాకుండా 61 మంది రేప్ కేసుల్లో, 6 మంది పోక్సో చట్టం కింద, 25 మంది మహిళలపై వేధింపుల కేసుల్లో, 229 మంది ఆయుధాల చట్టం ఉల్లంఘనల్లో, 135 మంది స్నాచింగ్, 19 మంది కిడ్నాప్, 67 మంది ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
అలవాటుపడిన నేరస్థులే ఎక్కువ మంది
తాజా క్రిమినల్ రికార్డులను పరిశీలిస్తే.. నిరసన ప్రదేశాల్లో హల్‌చల్ చేసిన వారిలో అత్యధికులు హ్యాబిచ్యువల్ అఫెండర్స్ అని స్పష్టమవుతోంది. అంటే వీరిపై ఒకటి కన్నా ఎక్కువ తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి.
* హత్య కేసులు: మొత్తం 101 మంది ఉండగా.. అందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో 42 మంది, పది లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో 12 మంది నిందితులుగా ఉన్నారు.
* హత్యాయత్నం కేసులు: మొత్తం 62 మంది ఉండగా.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో 25 మంది ఉన్నారు.
* దోపిడీ కేసులు: మొత్తం 284 మంది ఉండగా.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో 155 మంది, పది కంటే ఎక్కువ కేసుల్లో 31 మంది నిందితులుగా ఉన్నారు.
* అత్యాచారం కేసులు: మొత్తం 61 మంది ఉండగా.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో 8 మంది నిందితులుగా ఉన్నారు.
* మహిళలపై వేధింపులు: మొత్తం 25 మంది ఉండగా.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో 6 మంది ఉన్నారు.
* మత్తు పదార్థాల (NDPS) కేసులు: మొత్తం 67 మంది ఉండగా.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో 9 మంది నిందితులుగా ఉన్నారు.
ఈ డేటా మొత్తాన్ని బట్టి చూస్తే, విద్యార్థుల నిరసనల పేరుతో ధర్నా స్థలికి వచ్చిన వారిలో చాలామంది సాధారణ పౌరులు కారని, పదే పదే తీవ్ర నేరాలకు పాల్పడే ఘాతకులని ఢిల్లీ పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.




