Rahul Gandhi: అధికారం ఉందనే అహంకారంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారు: మంత్రి తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం!
Rahul Gandhi: దిల్లీలో రోడ్డు తనిఖీ సందర్భంగా వీడియో తీస్తున్న యువకుడిని మంత్రి పర్వేశ్ వర్మ చెంపదెబ్బ కొట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
Rahul Gandhi: దిల్లీలో రోడ్డు తనిఖీ సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దిల్లీ ప్రజా పనులశాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి పర్వేశ్ వర్మ రోడ్డు పరిశీలనకు వెళ్లిన సమయంలో, వీడియో తీస్తున్న ఓ యువకుడిపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల మధ్యలో ప్రశ్నిస్తే చెంపదెబ్బ కొట్టడం, పేపర్ లీక్స్‌పై అడిగితే లాఠీచార్జ్ చేయడం, పార్లమెంట్‌లో గొంతు నొక్కడం ఇవన్నీ అధికారం ఉందనే అహంకారంతో చేసే చర్యలే అని విమర్శించారు. తప్పు చేస్తే ప్రజలు గద్దె దించుతారనే భయం కూడా ఆ పార్టీ నేతల్లో లేదని, ఓటు చోరీతో అధికారంలోకి రావడం వల్లే వారికి ప్రజల మద్దతుతో పన్లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి పర్వేశ్ వర్మ స్పందిస్తూ.. ఇలాంటి విషయాలకు ఆయన దూరంగా ఉండాలని సూచించారు. అసలు ఆ విషయాల గురించి రాహుల్ గాంధీకి ఏమీ తెలియదని కొట్టిపారేశారు.
ఆదివారం తిలక్‌నగర్ నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించేందుకు మంత్రి పర్వేశ్ వర్మ వెళ్లారు. ఆ సమయంలో స్థానికులు రోడ్డు నిర్మాణంపై నిలదీస్తుండగా, ఓ యువకుడు దానిని వీడియో తీస్తూ సమస్యలను ప్రస్తావించాడు. దీనితో ఆగ్రహించిన మంత్రి ఆ యువకుడిపై చేయి చేసుకున్నారు.




