Delhi: కుప్పకూలిన 5 అంతస్తుల హాస్టల్ బిల్డింగ్..ఐదుగురు మృతి, మరి కొందరి పరిస్థితి విషమం!
Delhi: ఢిల్లీలోని సత్యనికేతన్‌లో 5 అంతస్తుల హాస్టల్ భవనం కూలి ఐదుగురు మరణించారు.
Delhi: కుప్పకూలిన 5 అంతస్తుల హాస్టల్ బిల్డింగ్..ఐదుగురు మృతి, మరి కొందరి పరిస్థితి విషమం!
Delhi Satya Niketan PG Building: దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 75 బెడ్ల సామర్థ్యం కలిగిన 5 అంతస్తుల 'హాస్టల్ డేజ్' అనే బాయ్స్ పీజీ హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు తొమ్మిది మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు.
సుమారు 40 నుంచి 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం బేస్‌మెంట్‌లో ప్రమాదం జరిగే సమయంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. సత్యనికేతన్ ప్రాంతం ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో ఉండటంతో ఇక్కడ వేలాది మంది విద్యార్థులు పీజీల్లో నివసిస్తుంటారు.
ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 50 మంది వరకు విద్యార్థులు ఉండి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో కొందరు స్వగ్రామాలకు వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శాయశక్తులా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. విద్యాసంస్థల్లో తగినన్ని హాస్టల్ సౌకర్యాలు లేకపోవడం వల్లే విద్యార్థులు ఇరుకైన, అమానవీయ పరిస్థితుల్లో పీజీల్లో ఉండాల్సి వస్తోందని, విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా సమీక్షించారు. బాధితులకు తగిన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.




