Funerals: అంత్యక్రియలకూ ఆన్‌లైన్ బుకింగ్ ఉందని తెలుసా? రూ. 6 వేలకే ప్యాకేజీ!
Funerals: ఢిల్లీకి చెందిన మోక్ష వాయేజ్ స్టార్టప్ హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సర్వీస్‌ను ప్రారంభించింది, ఇందులో రూ. 6 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్యాకేజీలు ఉన్నాయి.
Funerals: అంత్యక్రియలకూ ఆన్‌లైన్ బుకింగ్ ఉందని తెలుసా? రూ. 6 వేలకే ప్యాకేజీ!
Funerals: ఢిల్లీకి చెందిన మోక్ష వాయేజ్ అనే స్టార్టప్ హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలను బుక్ చేసుకునే సర్వీస్‌ను లాంచ్ చేసింది. ఇంట్లో ఎవరైనా చనిపోతే బంధువులు తీవ్ర దుఃఖంలో ఉంటారు. ఆ సమయంలో అంత్యక్రియల ఏర్పాట్ల భారాన్ని తగ్గించడమే ఈ సర్వీస్ ఉద్దేశమని సంస్థ తెలిపింది. పాడె మోసేందుకు నలుగురిని ఏర్పాటు చేయడం నుంచి అస్థికలను నదిలో కలిపే వరకు అన్ని పనులను సంస్థే చూసుకుంటుంది. దగ్గరి నుంచి పూజారిని పిలిపించడం, కట్టెలు, పువ్వులు సిద్ధం చేయడం కూడా ఇందులో భాగమే. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించడం, కర్మకాండలకు కావాల్సిన సామగ్రిని సమకూర్చడం వంటి సేవలను కూడా అందిస్తున్నారు.
ఎంచుకునే సేవలను బట్టి రూ. 6 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. ఎవరైనా తాము బతికుండగానే తమ అంత్యక్రియలను ముందుగా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. తన తర్వాత కుటుంబానికి ఇబ్బంది ఉండకూడదని కోరుకునే వారికి, తమ కోరికల ప్రకారం కార్యక్రమాలు జరగాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది. ఈ సర్వీస్‌ను నమో గంగే వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు దేశంలోని మరికొన్ని నగరాల్లో సేవలు అందిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో కూడా ఈ సంస్థ తన ప్యాకేజీలను ప్రదర్శించింది. అక్కడ ఇప్పటికే 300 మందికి పైగా ముందస్తు బుకింగ్‌కు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది.
అంత్యక్రియల సేవల్లో స్టార్టప్‌లు రావడం ఇదే మొదటిసారి కాదు. ముంబైకి చెందిన సర్వపూజ ఆన్‌లైన్‌లో అంత్యక్రియల కిట్లను విక్రయిస్తోంది. కోల్‌కతాకు చెందిన అంత్యేష్టి శ్మశానవాటిక, పూజారి, వాహనం బుకింగ్‌లను చూస్తోంది. అహ్మదాబాద్‌లో మోక్షశీల్ సంస్థ ఇలాంటి సేవలనే అందిస్తోంది. ఢిల్లీలో 2019లో మొదలైన లాస్ట్ జర్నీ సంస్థ 2022 ఆగస్టులో సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో ఆధునిక శ్మశానవాటికను కూడా ప్రారంభించింది. ఈ కొత్త తరహా సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా వంటి దేశాల్లో అంత్యక్రియలను ముందుగానే బుక్ చేసుకోవడం సాధారణమే. మన దేశంలో కూడా ఇలాంటి ప్లానింగ్ సేవలకు ఆదరణ పెరుగుతుందేమో చూడాలి.




