Indore Fire Accident: ఇండోర్ ఈవీ ప్రమాద మరణాలు డిజిటల్ లాక్ కారణంగానేనా?

Indore Fire Accident: ఇండోర్ లో ఇటీవల అగ్నిప్రమాదంలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ఇంటికి అమర్చిన డిజిటల్ లాక్స్ పనిచేయకపోవడమే కారణంగా చెబుతున్నారు.

KVD Varma
Published on: 20 March 2026 6:32 PM IST
Indore Fire Accident: ఇండోర్ లో ఇటీవల అగ్నిప్రమాదంలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే.
X

Indore Fire Accident

Indore Fire Accident: మధ్యప్రదేశ్ ఇండోర్ లో బ్రిజేశ్వరి అనెక్స్ కాలనీలో మార్చి 17వ తేదీ రాత్రి, రబ్బరు వ్యాపారి మనోజ్ పుగాలియాకు చెందిన మూడు అంతస్తుల ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇంటికి ఉన్న డిజిటల్ లాక్స్ తెరుచుకోకపోవడంతో, కుటుంబ సభ్యులు బయటపడలేకపోయారని పోలీసులు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ సంఘటన డిజిటల్, స్మార్ట్, సెన్సార్ ఆధారిత డోర్ లాక్‌ల భద్రతపై ఆందోళనలను రేపుతోంది. డిజిటల్ లాక్స్ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించడానికి బదులుగా వారిని బయట పడనీయకుండా చేస్తున్నాయా? దీనికి నిపుణులు ఏమి చెబుతున్నారు? తెలుసుకుందాం

నిపుణుల అభిప్రాయం ప్రకారం , ఎలక్ట్రానిక్ లాక్స్ సాధారణ పరిస్థితులలో బాగా పనిచేస్తాయి, కానీ అగ్నిప్రమాదం, అధిక వేడి లేదా షార్ట్ సర్క్యూట్ వంటి అసాధారణ పరిస్థితులలో విఫలం కావచ్చు. తాళం లోపల ఉండే సిలికాన్ చిప్‌లు, సర్క్యూట్‌లు 60-70°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద పనిచేయడం ఆగిపోతాయి. దీనివల్ల లాక్ జామ్ అవుతుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు, బ్యాటరీ లేదా సర్క్యూట్ విఫలమైతే, చాలా సందర్భాల్లో తలుపు తెరవడానికి వేరే మార్గం ఉండదని కూడా అంటున్నారు.

ఒకటే దారి..

ఇంతకు ముందు ఇళ్లలో రెండు వైపులా రాకపోకలకు అవకాశం ఉండేలా ద్వారాలు ఉండేవి. కానీ, ఇప్పుడు ఒక్కటే ద్వారం ఉంటోంది. నగరాల్లో అపార్ట్‌మెంట్ల సంస్కృతి ఈ పరిస్థితి తీసుకువచ్చింది. ఇప్పుడు ఇంటికి ఉండే ఒకే ద్వారాన్ని డిజిటల్ లాక్ తో నియంత్రిస్తే.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే మార్గం మూసుకుపోతుంది.

మొబైల్‌పై ఆధారపడిన డిజిటల్ లాక్ ను వేరొకరు తెరవలేరని నిపుణులు చెబుతున్నారు. నెట్‌వర్క్ లేదా యాప్ విఫలమైతే లాక్ కూడా విఫలమవుతుంది. డిజిటల్ లాక్స్ సౌకర్యాన్ని పెంచాయి. సెక్యూరిటీ పరంగా మంచి ఆప్షన్ కానీ, వాటిపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం కూడా కావచ్చు.

9V/12V బ్యాటరీలు లేదా ఇన్వర్టర్లతో పనిచేసే లాక్‌లలో బ్యాటరీ పాడవడం, ఉబ్బడం లేదా అధిక వేడికి గురికావడం సర్వసాధారణం. లోపల జరిగే ఏవైనా లోపాల గురించి వినియోగదారునికి తెలియకపోవచ్చు. ఒకవేళ సర్క్యూట్ అకస్మాత్తుగా విఫలమై, అదే క్షణంలో ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

మీరు కూడా డిజిటల్ లాక్ వాడుతుంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.

తాళంలో మాన్యువల్ కీ లేదా లివర్‌ను ఉంచాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అత్యవసర ఆపరేషన్ సమాచారం కోసం ఎప్పుడూ తనిఖీ చేయండి. డిజిటల్ లాక్ వాడే ఇంట్లో కచ్చితంగా స్మోక్ సెన్సార్లు వాడాలి. ముఖ్యంగా మరింత సున్నితమైన ప్రాంతాలలో అమర్చండి.

ఫైర్ అలారాలు, స్ప్రింక్లర్ సిస్టమ్‌లను అమర్చుకోవడం కూడా బెటర్. ఏవైనా సమస్యలను ముందుగానే గుర్తించడానికి క్రమం తప్పకుండా సర్వీస్ చేయించండి. అలాగే, డిజిటల్ లాక్ బ్యాటరీ పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి.

డిజిటల్ లాక్స్ ధర 6 వేల నుండి 90 వేల వరకు

డిజిటల్ లాక్‌ల ధరలు 6,000 నుండి 90,000 రూపాయల వరకు ఉంటాయి. గోద్రెజ్, డోర్సెట్, ఓజోన్‌తో సహా 10 నుండి 12 ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. అన్ని లాక్‌లు ఒకే విధమైన పనిని చేస్తాయి.

ధరలు పెరిగే కొద్దీ, ఫేస్ రికాగ్నేషన్, మొబైల్ ఆపరేషన్, అలారం కాల్స్ వంటి ఫీచర్లు పెరుగుతాయి. వీటిని పిన్ నంబర్లు, కార్డులు, వేలిముద్రలు, తాళాలు, ఇతర వ్యవస్థలను ఉపయోగించి తెరవవచ్చు.

ఏదిఏమైనా టెక్నాలజీ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాన్ని ఇండోర్ ఘటన చెబుతోంది. ఇక్కడ రెండు టెక్నాలజీలు ప్రమాదానికి కారణం. ఒకటి ఈవీ ఛార్జింగ్. రెండు అత్యవసర సమయంలో డిజిటల్ లాక్ ఓపెన్ కాకపోవడం. అదీ కాకుండా ఇంటిలో అందం కోసం చేయించుకున్న ఇంటీరియర్ లో వాడిన మెటీరియల్ కూడా మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయి.

KVD Varma

KVD Varma

Next Story