DILRMP 3.0 : భూ రికార్డుల్లో డిజిటల్ విప్లవం.. DILRMP 3.0 షురూ.!
DILRMP 3.0 : భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్
DILRMP-3.0
DILRMP 3.0 : భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్' మూడో విడత (DILRMP 3.0) ఆపరేషనల్ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం అధికారికంగా విడుదల చేశారు. 2026-31 కాలానికి గాను రూ. 565.5 కోట్ల కేటాయింపులతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
రైతులకు సులభంగా రుణాలు
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. భూమి అనేది కేవలం మట్టి ముక్క కాదని, అది రైతుల ఆత్మగౌరవమని పేర్కొన్నారు. కేవలం భూ రికార్డులను డిజిటలైజ్ చేయడమే కాకుండా, సమగ్ర ల్యాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను తీసుకురావడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దీనివల్ల రైతులకు బ్యాంకు రుణాలు వేగంగా అందుతాయని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని తెలిపారు.
ప్రతి భూకమతానికి 14 అంకెల ప్రత్యేక గుర్తింపు (భు-ఆధార్)
ఈ పథకం కింద ప్రతి భూభాగానికి (Land Parcel) 14 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. దీనిని 'భు-ఆధార్' (Unique Land Parcel Identification Number) గా పిలుస్తారు. దీనితో పాటు భూమి మ్యాప్‌లను (Cadastral Maps) పూర్తిస్థాయిలో జియో-రెఫరెన్సింగ్‌తో సరికొత్త GIS డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకువస్తారు.
పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో 'రిజిస్ట్రేషన్ కేంద్రాలు'
ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే 75 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగానే 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు'గా ఆధునీకరించనున్నారు. అలాగే పాత భూ రికార్డులను స్కాన్ చేయడం, రిజిస్ట్రేషన్ల డిజిటల్ రికార్డులను భద్రపరచడం, రెవెన్యూ కోర్టులను కంప్యూటరీకరించడం వంటి పనులను కూడా వేగవంతం చేయనున్నారు. పట్టణ ప్రాంత భూముల డిజిటల్ మ్యాపింగ్ కోసం 'నక్షా' (NAKSHA) పథకం ద్వారా ఆస్తి కార్డులు అందజేస్తారు.
రాష్ట్రాలకు 'ల్యాండ్ స్టాక్' సౌకర్యం
DILRMP 3.0 ద్వారా ప్రతి రాష్ట్రం తన సొంత ల్యాండ్ డేటాసెట్‌లను సమగ్రంగా అనుసంధానించుకుని 'ల్యాండ్ స్టాక్' తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇవి కేంద్ర డేటాబేస్‌తో అనుసంధానమై ఉన్నప్పటికీ, భూ రికార్డుల నియంత్రణ , హక్కులు పూర్తిస్థాయిలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉంటాయి.
100% కేంద్ర నిధులతో అమలు
ఈ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేయనున్నారు. పనితీరు ఆధారంగా విడతల వారీగా నిధులను విడుదల చేస్తారు. పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక రియల్ టైమ్ డాష్ బోర్డ్ (DILRMP-MIS) కూడా అందుబాటులో ఉంటుంది. మొదటి రెండు దశల్లో ఇప్పటికే 99.9 శాతం హక్కుల పత్రాలు డిజిటలైజ్ కావడం విశేషం.




