Disha Salian Case: ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు.. దిశ శాలియన్ తండ్రి సంచలన నిర్ణయం!
Disha Salian Case: దిశా శాలియన్ మృతి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు.
Disha Salian Case: ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు.. దిశ శాలియన్ తండ్రి సంచలన నిర్ణయం!
Disha Salian Case: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శివసేన (యూబీటీ) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రేతో పాటు ఎన్‌సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు రూ.500 కోట్ల పరువు నష్టం లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. దిశ మృతి కేసులో న్యాయం కోసం తాము చేస్తోన్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపితమైనదిగా చిత్రీకరించేందుకు వారు ప్రయత్నించారని ఆరోపిస్తూ దిశ తండ్రి సతీశ్ ఈ భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు.
2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనంపై నుంచి పడి దిశా శాలియన్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సైతం తన ఫ్లాట్‌లో శవమై కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రెండు ఘటనలు అప్పట్లో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. నాటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం దిశ మృతి కేసును కప్పిపుచ్చేందుకు యత్నించిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో దిశ మృతిని హత్య, అత్యాచార కోణాలతో పాటు సుశాంత్ మృతితోనూ ముడిపెట్టి ప్రచారాలు సాగాయి. అయితే, ఆ సమయంలో తన కుమార్తె మృతిపై తండ్రి సతీశ్ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.
ఇదిలాఉంటే, ఇటీవల కోర్టులో వేసిన పిటిషన్‌లో సతీశ్ కొన్ని సంచలన విషయాలు ప్రస్తావించారు. తన కుమార్తె మృతి చెందిన రోజున ఇంట్లో పార్టీ జరిగిందని, దానికి ఆదిత్య ఠాక్రేతో పాటు ఆయన బాడీగార్డులు, నటులు సూరజ్ పంచోలి, డినో మోరియా, మరికొందరు హాజరయ్యారని పేర్కొన్నారు. మరోవైపు దిశపై సామూహిక అత్యాచారం జరిగిందని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని ఈ కేసు వాదిస్తున్న లాయర్ వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లడం గమనార్హం.
తన కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సతీశ్ డిమాండ్ చేశారు. ఆ క్షమాపణలను ప్రధాన మీడియాలో ప్రచురించి, ప్రసారం చేయాలని.. అంతేకాకుండా వాటిని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ పోస్టు చేయాలని లీగల్ నోటీసుల్లో స్పష్టం చేశారు. మరోవైపు తనపై వస్తోన్న ఆరోపణలను ఆదిత్య ఠాక్రే పూర్తిగా తోసిపుచ్చారు. దిశా శాలియాన్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు.




