Fire Accidents: పండుగ వేళ పెను ప్రమాదాలు.. ఫ్యాక్టరీలు, అపార్ట్‌మెంట్లు, గోదాముల్లో అగ్ని కీలలు
దీపావళి వేళ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అగ్నిప్రమాదాలు కలకలం రేపాయి. ఢిల్లీ, ఘజియాబాద్, థానే, జమ్మూ, పాట్నా, సిక్కింలో ఫ్యాక్టరీలు, అపార్ట్‌మెంట్లు, గోదాముల్లో మంటలు చెలరేగాయి.
Fire Accidents
Fire Accidents: దీపావళి పండుగ వేళ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు కలకలం రేపాయి. పటాకుల చిచ్చు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాక్టరీలు, గోదాములు, నివాస భవనాల్లో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ, ఘజియాబాద్, థానే, జమ్మూ, పాట్నా, సిక్కిం ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల మంటలు భారీగా వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. లక్షల రూపాయల విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఘజియాబాద్‌లో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ దగ్ధం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ విజయనగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న నోవా బోల్ట్ ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ కుర్చీల తయారీకి ఉపయోగించే ముడిసరుకు, ఇతర మండే వస్తువులు పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నాయి. దీంతో మంటలు వేగంగా వ్యాపించి భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు 12కు పైగా ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించారు. ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం సిబ్బందికి కష్టంగా మారింది.
అపార్ట్‌మెంట్‌లోకి పటాకుల నిప్పురవ్వలు
ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో ఉన్న జీహెచ్-7 సొసైటీలో మరో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని పదో అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లాట్‌కు తాళం వేసి ఉండటంతో లోపల ఎవరూ లేరు. అయితే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయాయి. బయట నుంచి వచ్చిన పటాకుల నిప్పురవ్వ బాల్కనీలో పడటంతోనే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఫ్లాట్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
ఢిల్లీలో గార్మెంట్ ఫ్యాక్టరీకి మంటలు
దేశ రాజధాని ఢిల్లీలోని నజఫ్‌గఢ్ పరిధిలో ఉన్న నాంగ్లీ సక్రావతి ప్రాంతంలో గార్మెంట్ ఫ్యాక్టరీ అగ్నికి ఆహుతైంది. సాయంత్రం సుమారు 4.22 గంటలకు అగ్నిప్రమాదంపై ఫైర్ విభాగానికి సమాచారం అందింది. ఫ్యాక్టరీలో దుస్తులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. వెంటనే 25 ఫైర్ ఇంజిన్లను ఘటనాస్థలికి పంపించారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం భవనం పూర్తిగా చల్లబడేలా కూలింగ్ ఆపరేషన్ చేపట్టారు.
థానేలో మూడు అంతస్తులకు మంటలు
ముంబై సమీపంలోని థానేలో ఉన్న రహేజా గార్డెన్ నివాస సముదాయంలోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని 8, 9, 10 అంతస్తుల్లో మంటలు వ్యాపించడంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ప్రమాదం తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అర్ధరాత్రి ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు జమ్మూలోని ఓ భారీ గోదాములో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బిహార్ రాజధాని పాట్నా, ఈశాన్య రాష్ట్రం సిక్కింలోనూ గోదాములు, పాత ఆసుపత్రి ప్రాంగణం, పాత సామాన్లు నిల్వ చేసే ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి.




