DK Shivakumar: జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం!

DK Shivakumar: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది.

Arun Chilukuri
Published on: 30 May 2026 5:28 PM IST
DK Shivakumar
X

DK Shivakumar: జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం!

DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే జూన్ 3వ తేదీన సాయంత్రం 4:10 గంటలకు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్ శనివారం అధికారికంగా వెల్లడించారు. బెంగళూరులో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావద్దని, సాదాసీదాగా ఈ వేడుక సాగుతుందని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) భేటీలో డీకే శివకుమార్‌ను అధికారికంగా సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు.

డీకే శివకుమార్‌కు దైవభక్తి, జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఆయన తన వ్యక్తిగత జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్‌ను సంప్రదించిన తర్వాతే జూన్ 3వ తేదీ సాయంత్రం కాలాన్ని "శుభ ముహూర్తం"గా నిర్ణయించుకున్నారు. దీనికి తోడు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకానుండటంతో, ఆయన అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి కూడా ఈ తేదీని ఖరారు చేశారు.

సీఎల్పీ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో నలుగురు ఉప ముఖ్యమంత్రులను (Deputy CMs) నియమించాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను డీకే శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. చివరికి డీకేతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని టాక్. సామాజిక సమతుల్యతలో భాగంగా వారిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారై ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా తర్వాత, పార్టీలోని వివిధ సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాల్‌గా మారింది. సిద్ధరామయ్య రూపంలో ఒక బలమైన ఓబీసీ (OBC) ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చినందున.. ఆ వర్గం అసంతృప్తికి గురికాకుండా ఉండటం కోసం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కొత్త ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి (పోర్ట్‌ఫోలియో) దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రాహుల్ గాంధీ మార్గదర్శకాల ప్రకారం.. రాబోయే కేబినెట్‌లో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు సింహభాగం ప్రాధాన్యత కల్పించనున్నారు. అంతేకాకుండా, 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మంత్రివర్గంలో యువ నాయకులకు పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story