MK Stalin: 'సూట్‌కేస్ భామ' అంటూ స్టాలిన్ వివాదాస్పద కామెంట్స్.. తమిళనాడులో పొలిటికల్ హీట్!

MK Stalin: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ టీవీకే మహిళా అభ్యర్థిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తమిళనాడు రాజకీయాల్లో చెలరేగిన దుమారం మరియు మంత్రుల ఆగ్రహం పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 3 Oct 2026 11:19 AM IST
MK Stalin
X

MK Stalin: 'సూట్‌కేస్ భామ' అంటూ స్టాలిన్ వివాదాస్పద కామెంట్స్.. తమిళనాడులో పొలిటికల్ హీట్!

MK Stalin: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా నిలిచారు. అధికార టీవీకే (TVK) పార్టీకి చెందిన మహిళా అభ్యర్థిని ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. అధికార పార్టీతో పాటు పలు రాజకీయ వర్గాల నుంచి స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..?

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్యభామ అన్నాడీఎంకే (AIADMK) అభ్యర్థిగా ధారాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే తదనంతరం ఆ ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి, విజయ్‌కు చెందిన టీవీకే పార్టీలో చేరారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో ఆమె టీవీకే తరఫున బరిలోకి దిగారు.

ఈ ప్రచారంలో భాగంగా ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ.. సత్యభామ డబ్బులకు ఆశపడి పార్టీ ఫిరాయించారని ఆరోపించారు. సత్యాన్ని పాటించని ఆమె సత్యభామ కాదని, అసలు సిసలు ‘సూట్‌కేస్’ భామ అంటూ తీవ్ర పదజాలంతో ఎద్దేవా చేశారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచాయి.

స్టాలిన్‌ వ్యాఖ్యలను తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె దళితురాలు అనే కారణంతోనే స్టాలిన్‌ బాడీ షేమింగ్‌కు, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆరోపించారు. వెంటనే ఆమెకు స్టాలిన్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎంకే నేతలకు ఎప్పుడూ మహిళల పట్ల కనీస గౌరవం ఉండదని విమర్శించారు.

గతంలో స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్న సంగతిని నేతలు గుర్తుచేశారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ మాట్లాడుతూ.. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో, తాజా ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.