Tamil Nadu: సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్!

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌పై బహిరంగంగా తీవ్ర బెదిరింపు వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే జి.వి.మార్కండేయన్‌

Arun Chilukuri
Published on: 20 July 2026 12:40 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌పై బహిరంగంగా హింసాత్మక, బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గ డీఎంకే (DMK) ఎమ్మెల్యే జి.వి.మార్కండేయన్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. కొవిల్‌పట్టిలో జరిగిన పార్టీ బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడిన వివాదాస్పద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఈ తక్షణ చర్య తీసుకున్నారు.

కొవిల్‌పట్టిలోని కృష్ణన్ కోవిల్ మైదానంలో ఆదివారం రాత్రి డీఎంకే పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఎమ్మెల్యే మార్కండేయన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ పనితీరు, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి విజయ్‌ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ.. "అసెంబ్లీ కనుక సమావేశమైతే నీ ఎముకలు మిగలవు, మా డీఎంకే శాసనసభ్యులు నీ ఎముకలు విరగ్గొట్టి నిన్ను వెనక్కి పంపుతారు" అంటూ నేరుగా ముఖ్యమంత్రికే హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ఒక శాసనసభ్యుడు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. సోమవారం తెల్లవారుజామునే విలాతికుళంలోని మార్కండేయన్ నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే అరెస్ట్ వార్త తెలియడంతో డీఎంకే కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకుని పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి, మార్కండేయన్‌ను తదుపరి విచారణ నిమిత్తం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ తాజా అరెస్టుతో తమిళనాడులో అధికార తమిళగ వెట్రి కజగం (TVK), ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్య పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story