DRDO: ఇక శత్రువల ఆటలు సాగవు.. క్షిపణులను గాల్లోనే పేల్చేసే వ్యవస్థ
DRDO: దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది.
DRDO: ఇక శత్రువల ఆటలు సాగవు.. క్షిపణులను గాల్లోనే పేల్చేసే వ్యవస్థ
DRDO: దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు, సముద్ర యుద్ధ సామర్థ్యాలను పరీక్షించి విజయాన్ని సాధించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఇటీవల నిర్వహించిన మూడు ప్రధాన క్షిపణి పరీక్షలు విజయవంతవమ్యాయి.
దూరప్రాంత క్షిపణి దాడులకు చెక్ పెట్టే రక్షణ కవచం
జూన్ 10, 11 తేదీల్లో నిర్వహించిన వరుస పరీక్షల్లో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఇంటర్‌సెప్టర్ క్షిపణులు తమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఈ పరీక్షల ద్వారా మల్టీ-లేయర్డ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థ పనితీరు నిరూపితమైంది. ఈ రక్షణ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే.. శత్రుదేశం ప్రయోగించే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే గుర్తించి, లక్ష్యానికి చేరుకునేలోపు నిర్వీర్యం చేయగలదు. ఒకటి కంటే ఎక్కువ స్థాయిల్లో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ముప్పును సమర్థంగా ఎదుర్కొనేలా దీనిని రూపొందించారు. భవిష్యత్తులో దేశ వ్యూహాత్మక భద్రతకు ఈ వ్యవస్థ కీలక బలంగా మారనుంది.
సముద్ర యుద్ధ సామర్థ్యాల్లో కొత్త అధ్యాయం
గగనతల రక్షణతో పాటు సముద్ర భద్రత విషయంలోనూ భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది. నావల్ యాంటీ షిప్ మిసైల్-మీడియం రేంజ్ (NASM-MR) తొలి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణిని శత్రు యుద్ధనౌకలు, సముద్రంలో కదులుతున్న లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే విధంగా రూపొందించారు. అధునాతన మార్గనిర్దేశక వ్యవస్థ, కచ్చితమైన లక్ష్య గుర్తింపు సామర్థ్యం దీనికి ప్రధాన బలం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ ఆయుధ వ్యవస్థ భారత నౌకాదళం దాడి సామర్థ్యాన్ని మరింత పెంచనుంది.
ప్రపంచ అగ్ర రక్షణ దేశాల సరసన భారత్
బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించగలగడం సాధారణ విషయం కాదు. ఈ తరహా సాంకేతిక సామర్థ్యం చాలా కొద్ది దేశాలకే ఉంది. తాజా విజయంతో అలాంటి అధునాతన రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసి అమలు చేయగల దేశాల జాబితాలో భారత్ మరింత బలంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
స్వదేశీ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలపై ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ విజయాలు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి కూడా బలాన్నిస్తున్నాయి. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా దేశీయంగా అత్యాధునిక రక్షణ వ్యవస్థలను రూపొందించగల సామర్థ్యం భారత్‌కు ఉందని మరోసారి రుజువైంది.
డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు
ఈ విజయాలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల విజయవంతమైన నిర్వహణలో భాగస్వాములైన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భారత సాయుధ దళాలు, సాంకేతిక బృందాల కృషిని ఆయన ప్రశంసించారు. దేశ రక్షణ వ్యవస్థను మరింత శక్తివంతంగా మార్చే దిశగా ఇవి కీలక అడుగులని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా స్వదేశీ రక్షణ సాంకేతికత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు.




