Driving Licence: ఇక‌పై 75 శాతం మార్కులు వ‌స్తేనే డ్రైవింగ్ లైసెన్స్‌.. నిబంధ‌న‌ల్లో కీల‌క మార్పులు!

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

Mokshith
Published on: 30 Oct 2026 6:16 PM IST
Driving Licence
X

Driving Licence: ఇక‌పై 75 శాతం మార్కులు వ‌స్తేనే డ్రైవింగ్ లైసెన్స్‌.. నిబంధ‌న‌ల్లో కీల‌క మార్పులు!

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పలు మార్పులను ప్రతిపాదించింది.

ఆన్‌లైన్ పరీక్షలో పాస్ మార్కులు పెంపు

డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు అభ్యర్థులకు నిర్వహించే ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో కీలక మార్పు రానుంది. ప్రస్తుతం ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 60 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుండగా.. ఇకపై ఆ పరిమితిని 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. అంటే పరీక్ష రాసే అభ్యర్థులు మరింత మెరుగైన అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించే ట్యుటోరియల్‌ కనీసం 30 నిమిషాల పాటు నిర్వహించాలని సూచించింది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాతే అసెస్‌మెంట్‌ ప్రక్రియ కొనసాగనుంది.

లైసెన్స్ వివరాల మార్పునకు గడువు

డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను సవరించుకోవడానికి దరఖాస్తు చేసుకునే వారికి కూడా కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఇలాంటి దరఖాస్తులను సంబంధిత అధికారులు 15 రోజుల్లోగా పరిశీలించి ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. తిరస్కరణకు నిర్ణయం తీసుకుంటే అందుకు గల కారణాలను దరఖాస్తుదారుడికి తెలియజేయడం తప్పనిసరి. చిరునామా మార్పునకు సంబంధించిన దరఖాస్తుపై 30 రోజుల్లోగా అధికారులు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోతే.. ఆ దరఖాస్తుకు ఆమోదం లభించినట్లుగా పరిగణించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. దీనివల్ల కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గడంతో పాటు దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గే అవకాశం ఉంది.

ఆధార్ ద్వారా ఆన్‌లైన్ సేవలు.. కొన్ని ఫీజులకు మినహాయింపు

డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం మరో ప్రతిపాదన చేసింది. ఆధార్ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో పొందగలిగే కొన్ని సేవలకు ఫీజు వసూలు చేయకూడదని భావిస్తోంది. ముఖ్యంగా లైసెన్స్‌లో పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను మార్చుకునే ప్రక్రియలో ఛార్జీలను తొలగించాలని ప్రతిపాదించింది. అలాగే గుర్తింపు, వయసు, నివాస చిరునామాను నిర్ధారించేందుకు సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా సవరించింది. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లు, ఇ-రేషన్ కార్డులను అనుమతించాలని పేర్కొంది. వీటితో పాటు గత మూడు నెలల్లో జారీ చేసిన విద్యుత్, గ్యాస్ బిల్లులను చిరునామా ఆధారాలుగా స్వీకరించనున్నారు. అయితే ఇప్పటివరకు ఈ అవసరానికి ఉపయోగిస్తున్న ఎల్‌ఐసీ పాలసీ పత్రాలను చిరునామా ధ్రువీకరణ జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదించారు.

లైసెన్స్ కార్డుల జారీలోనూ మార్పులు

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారితో పాటు ఇప్పటికే లైసెన్స్ కలిగి ఉండి రెన్యువల్ చేసుకునే వారికి కూడా కొత్త విధానం వర్తించేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇకపై జారీ చేసే కొత్త లైసెన్సులు, రెన్యువల్ కార్డులను లేమినేటెడ్ రూపంలో లేదా పీవీసీ కార్డులుగా అందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మార్పులపై సంబంధిత భాగస్వామ్య పక్షాలు, ప్రజల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. అందిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అప్పటివరకు ఇవి ప్రతిపాదిత నిబంధనలు మాత్రమే. తుది నిర్ణయం వెలువడిన తర్వాతే కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.