Earthquake: ఒకే నెలలో 130 సార్లు కంపించిన భూమి.. ముంచుకొస్తున్న భారీ ప్రమాదం?

 Earthquake: హిమాలయ పర్వత ప్రాంతం తీవ్రమైన భూకంప ప్రకంపనలతో వణికిపోతోంది.

CR Reddy
Published on: 2 Sept 2026 7:28 AM IST
Earthquake
X

Earthquake

Earthquake: హిమాలయ పర్వత ప్రాంతం తీవ్రమైన భూకంప ప్రకంపనలతో వణికిపోతోంది. కేవలం ఆగస్టు నెలలోనే 130కి పైగా భూకంపాలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదిక వెల్లడించింది. నేపాల్ జలప్రళయం సృష్టించిన భయం వీడకముందే, ఈ వరుస భూకంపాలు ఏదైనా పెద్ద ప్రమాదానికి సంకేతమా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్టు నెలలో హిమాలయ ప్రాంతంతో పాటు దాని సరిహద్దుల్లో ఉన్న హిందూకుష్-పామీర్ రీజియన్‌లో మొత్తం 130కి పైగా భూకంపాలు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికంగా 63 ప్రకంపనలు భారత్‌లోని హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లోనే సంభవించడం గమనార్హం. లడఖ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ భూభాగాల్లో ఏకంగా 36 సార్లు భూమి కంపించింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో 26 సార్లు, నేపాల్‌లో 10 సార్లు భూమి తీవ్రంగా స్పందించింది.

లడఖ్‌లో భూ ప్రకంపనలు

ఈ నమోదు అయిన భూకంపాల్లో చాలావరకు స్వల్ప తీవ్రత కలిగినవే అయినప్పటికీ, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఆగస్టు 13న లడఖ్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో బలమైన భూకంపం వచ్చింది. అదే రోజు 4.3 తీవ్రతతో మరో ప్రకంపన కూడా చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రాంతాల్లో సైతం వరుసగా భూమి కంపిస్తూనే ఉంది. స్వల్ప వ్యవధిలో ఇన్నిసార్లు భూమి స్వల్పంగా కంపించడం వెనుక భూగర్భంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నేపాల్ విషాదం కంటే పెద్ద ముప్పు ఉందా?

మరొకవైపు ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన భయంకరమైన వరదల వల్ల 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 4 వేల మందికి పైగా గల్లంతయ్యారు. లాంగ్‌టాంగ్ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం భారత్, నేపాల్ రెస్క్యూ టీమ్‌లు 185 మీటర్ల లోతు వరకు వెళ్లి సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఈ విషాదం నుంచి బయటపడక ముందే, హిమాలయ ప్రాంతాల్లో ఒకే నెలలో 130కి పైగా భూకంపాలు రావడం రాబోయే పెద్ద ప్రమాదానికి ముందస్తు హెచ్చరికా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.