Ebola Virus : మరో మహమ్మారి ముంగిట ప్రపంచం.. ఇండియాలోకి రాకుండా కేంద్రం మాస్టర్ ప్లాన్
Ebola Virus : ఆఫ్రికాలో ఇబోలా వైరస్ విజృంభిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, పుణె ల్యాబ్‌లో పరీక్షల ఏర్పాట్లు పూర్తి చేసింది.
Ebola Virus
Ebola Virus : ఆఫ్రికా దేశాల్లో మళ్లీ ఎబోలా వైరస్ పడగ విప్పడంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతానికి మన దేశంలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, ముప్పు చాలా తక్కువగా ఉందని స్పష్టం చేస్తూనే.. ముందుజాగ్రత్తగా నిఘా పెంచాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల వద్ద నిఘా
ఆఫ్రికా నుండి వచ్చే ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున, ప్రధాన విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్ద స్క్రీనింగ్ ప్రక్రియను ముమ్మరం చేశారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్‌కు తరలించేలా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే వారి ప్రయాణ వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఐసీఎంఆర్ (ICMR) వంటి సంస్థలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి.
పుణె ఎన్ఐవీ ల్యాబ్ సిద్ధం
ఎబోలా నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)ని నోడల్ ల్యాబ్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా అనుమానిత కేసు వస్తే శాంపిల్స్‌ను వెంటనే ఇక్కడికి పంపి పరీక్షలు చేయనున్నారు. అవసరమైతే మరిన్ని ల్యాబ్‌లను కూడా ఈ నెట్‌వర్క్‌లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎబోలా వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని రకాల ఆరోగ్య మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.
వంద మందికి పైగా మృతి.. భారత్‌లో సదస్సులు!
ఆఫ్రికాలో ఈ తాజా బుండిబుగ్యో స్ట్రెయిన్ ఎబోలా కారణంగా ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు నివేదికలు అందుతున్నాయి. మరోవైపు, మే 28 నుంచి 31 వరకు ఢిల్లీలో ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ జరగనుంది. దీనికి కాంగో, ఉగాండా సహా పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే జూన్ 1న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సు కూడా ఉంది. ఈ కీలక సమావేశాల నేపథ్యంలో విదేశీ ప్రతినిధుల ఆరోగ్య పరీక్షల విషయంలో కేంద్రం మరింత పకడ్బందీగా వ్యవహరిస్తోంది.




