Pinarayi Vijayan: కేరళలో ఈడీ ప్రకంపనలు.. మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో సోదాలు!

Pinarayi Vijayan: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ (ED) సోదాలు కలకలం రేపాయి.

Arun Chilukuri
Updated on: 27 May 2026 12:13 PM IST
Pinarayi Vijayan
X

Pinarayi Vijayan: కేరళలో ఈడీ ప్రకంపనలు.. మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో సోదాలు!

Pinarayi Vijayan: కేరళ రాజకీయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరగ్గా.. అందులో మాజీ సీఎం నివాసం కూడా ఉండటం గమనార్హం.

కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటిల్ లిమిటెడ్‌ (CMRL) అనే సంస్థ నుంచి 'ఎక్స్‌లాజిక్‌ సొల్యూషన్స్‌' అనే ఐటీ కంపెనీకి రూ.2.73 కోట్లు బదిలీ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ భారీ మొత్తానికి బదులుగా ఎక్స్‌లాజిక్ సంస్థ ఎలాంటి ఐటీ సేవలను అందించలేదని సమాచారం. కాగా, ఈ ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ సంస్థ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె టి.వీణకు చెందినది కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందాలు ఉన్నప్పటికీ, అవన్నీ కేవలం మోసపూరితమైనవని సీరియస్‌ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (SFIO) తన అభియోగాల్లో స్పష్టం చేసింది. 2017 నుంచి 2020 మధ్య కాలంలో సీఎంఆర్‌ఎల్ నుంచి వీణ కంపెనీకి రూ.1.72 కోట్లు అక్రమంగా చేరినట్లు 2023 ఆగస్టులో వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO)ని ఆదేశించింది. ఈ విచారణ ఆధారంగా ఈడీ అధికారులు వీణపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే తాజాగా మాజీ సీఎం నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొయికోడ్‌లోని మాజీ మంత్రి, వీణ భర్త అయిన మహమ్మద్ రియాస్ నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

మరోవైపు ఈ కేసు కేరళలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. ప్రస్తుత కేరళ సీఎం వీడీ సతీశన్‌ క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులకు కూడా సీఎంఆర్‌ఎల్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున నిధులు అందాయని వామపక్ష నేత ఎంఏ బేబీ సంచలన ఆరోపణలు చేశారు. సీఎంఆర్‌ఎల్‌ చెల్లింపుల వివాదంపై రాష్ట్రంలో ఇప్పటికే తీవ్ర చర్చ నడుస్తుండగా, తాజా ఈడీ దాడులు కేరళ రాజకీయాల్లో మరింత వేడిని రగిల్చాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story