Bengal Polls Row: బెంగాల్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ కలకలం.. ఫల్తా నియోజకవర్గంలో రీ-పోలింగ్‌కు ఈసీ ఆదేశం!

పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు కలకలం రేపాయి. ఫల్తా నియోజకవర్గంలో బీజేపీ గుర్తుపై టేపులు అంటించడంతో ఆ బూత్‌లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.

Arun Chilukuri
Published on: 29 April 2026 3:12 PM IST
Bengal Polls Row
X

Bengal Polls Row: బెంగాల్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ కలకలం.. ఫల్తా నియోజకవర్గంలో రీ-పోలింగ్‌కు ఈసీ ఆదేశం!

Bengal Polls Row: పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని బీజేపీ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఫల్తా నియోజకవర్గంలో ఈవీఎంలపై బీజేపీ అభ్యర్థి పేరు, గుర్తు కనిపించకుండా టేపులు అంటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈవీఎంలపై టేపులు.. అమిత్ మాలవ్య ఆరోపణ

బీజేపీ ఐటీ విభాగం చీఫ్, బెంగాల్ కో-ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవ్య సోషల్ మీడియా వేదికగా ఈ అక్రమాలను బయటపెట్టారు. ఫల్తా నియోజకవర్గంలోని బూత్ నంబర్ 144, 170 మరియు 189లలో ఈవీఎంలపై కమలం గుర్తు కనిపించకుండా నలుపు లేదా తెలుపు టేపులు అంటించారని ఆయన ఫోటోలతో సహా ఆరోపించారు. టీఎంసీ కావాలనే ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ఈ పని చేసిందని బీజేపీ విమర్శించింది.

ఈ ఘటనలపై ఎన్నికల సంఘం (EC) వెంటనే స్పందించింది. పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ దీనిపై కీలక ప్రకటన చేశారు. ఈవీఎంలపై టేపులు అంటించి ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మళ్లీ పోలింగ్ (Re-polling) నిర్వహించాలని ఆదేశించారు. ఒకవేళ ఒకే నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరిగితే, ఏకంగా మొత్తం నియోజకవర్గానికే తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

ఐపీఎస్ ఆఫీసర్ వర్సెస్ టీఎంసీ నేత

ఫల్తా నియోజకవర్గం టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌కు పట్టున్న ప్రాంతం. ఇక్కడే ఎన్నికల అబ్జర్వర్‌గా వచ్చిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు, జహంగీర్ ఖాన్‌కు మధ్య ఇప్పటికే తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ప్రజలను భయాందోళనకు గురిచేస్తే సహించేది లేదని అజయ్ పాల్ శర్మ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ ఘటన వెలుగులోకి రావడం ఉత్కంఠ రేపుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story