PMO అధికారినంటూ ఎంట్రీ.. మంత్రితో ఫొటోలు.. చివరికి షాకింగ్ ట్విస్ట్.!

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయంలో అత్యంత తీవ్రమైన భద్రతా లోపం, నకిలీ అధికారుల అవతారం కలకలం రేపింది. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం..

G Krishna
Published on: 3 Oct 2026 12:30 PM IST
Fake PMO Officer Akanksha Vidyarthi
X

Fake PMO Officer Akanksha Vidyarthi

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయంలో అత్యంత తీవ్రమైన భద్రతా లోపం, నకిలీ అధికారుల అవతారం కలకలం రేపింది. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సీనియర్ అధికారినంటూ నమ్మించి సచివాలయంలోకి అడుగుపెట్టి, ఏకంగా ఒక రాష్ట్ర మంత్రిని కలిసిన ఆకాంక్ష విద్యార్థి అనే మహిళను పశ్చిమ బెంగాల్ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సెంట్రల్ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్‌పై బెంగాల్‌కు తరలించారు.

ప్రధాని కార్యాలయం పేరుతో ఈ-మెయిల్.. మంత్రితో భేటీ

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డాక్టర్ ఆకాంక్ష విద్యార్థి అనే మహిళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యాలయంతో తనకు అనుబంధం ఉందంటూ పశ్చిమ బెంగాల్ మంత్రికి ముందస్తుగా ఈ-మెయిల్ పంపింది. తాను పీఎంఓలో ఉన్నతాధికారినని నమ్మించి, అపాయింట్‌మెంట్ సాధించింది. నిర్ణీత సమయానికి సచివాలయానికి చేరుకుని మంత్రిని నేరుగా కలవడమే కాకుండా, ఆయనతో కలిసి పలు ఫోటోలు కూడా దిగడం గమనార్హం.

మంత్రి అనుమానంతో బయటపడ్డ మోసం

సమావేశం జరుగుతున్న సమయంలో సదరు మహిళ సంభాషణ, ఆమె ప్రవర్తనపై రాష్ట్ర మంత్రికి తీవ్ర అనుమానం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన మంత్రి కార్యాలయ సిబ్బంది, ఆ మహిళ క్లెయిమ్ చేసిన వివరాలను ప్రధాని కార్యాలయ వర్గాలతో సమగ్రంగా సరిచూశారు. విచారణలో ఆమె పీఎంఓ అధికారిణి కాదని, తప్పుడు సమాచారంతో మోసానికి పాల్పడిందని స్పష్టమైంది. దీనితో వెంటనే మంత్రి కార్యాలయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఢిల్లీలో అదుపులోకి.. విచారణ ముమ్మరం

ఫిర్యాదు స్వీకరించిన హౌరా పోలీసులు సదరు మహిళపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీస్ బృందం వెంటనే రంగంలోకి దిగి, ఢిల్లీలోని సెంట్రల్ ప్రాంతంలో ఆకాంక్ష విద్యార్థిని పట్టుకుంది. అనంతరం ఢిల్లీ కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొంది హౌరాకు తీసుకువచ్చారు. అసలు ఈ మహిళ సచివాలయంలోకి ఏ ఉద్దేశంతో ప్రవేశించింది, వెనుక ఏవైనా ముఠాలు ఉన్నాయా లేదా గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.