Viral Video: పైకి చూసి సినిమా షూటింగ్ అనుకునేరు.. లోపల జరిగిన సీన్ తెలిస్తే బిత్తరపోతారు

Viral Video: అచ్చం 'ఫర్జీ' సిరీస్ సీన్‌ను తలపించేలా ఉత్తరప్రదేశ్‌లో డ్రగ్ స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పేందుకు ఏకంగా రోడ్డుపై వంద రూపాయల నోట్ల వర్షం కురిపించారు.

Ravi
By Ravi
Published on: 4 Jun 2026 3:42 PM IST
Viral Video
X

Viral Video: పైకి చూసి సినిమా షూటింగ్ అనుకునేరు.. లోపల జరిగిన సీన్ తెలిస్తే బిత్తరపోతారు

Viral Video: సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రభావం నేరస్థుల ఆలోచనా విధానంపై ఎంతగా పడుతోందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఒక ఘటనే ఉదాహరణ. పాపులర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ'లో హీరో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రోడ్డుపై కట్టల కొద్దీ డబ్బులు వెదజల్లుతూ పారిపోయే సీన్ చూసే ఉంటారు. సరిగ్గా అదే ఐడియాను కాపీ కొట్టిన కొందరు డ్రగ్ స్మగ్లర్లు, నిజ జీవితంలో పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చి పారిపోవాలని చూశారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో భారీగా మత్తుపదార్థాల రవాణా జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసు బృందాలు ఒక అనుమానాస్పద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాయి. అయితే ఆ స్మగ్లర్లు పోలీసుల తనిఖీకి భయపడి వాహనాన్ని ఆపకుండా అతివేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో పోలీసులు వెంటనే వారి కారును వెంబడించడం ప్రారంభించారు.

పోలీసులు తమను ఎలాగైనా పట్టుకుంటారని భయపడిన ఆ స్మగ్లర్లు అప్పటికప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పోలీసుల దృష్టి మరల్చడానికి, రోడ్డుపై ఉన్న స్థానిక ప్రజలు ఆ డబ్బుల కోసం ఎగబడితే ట్రాఫిక్ జామ్ అవుతుందని భావించి.. తమ కారులోంచి 100 రూపాయల నోట్లను గాలిలోకి విసరడం మొదలుపెట్టారు. రోడ్డుపై వంద రూపాయల నోట్ల వర్షం కురిపిస్తూ పారిపోవాలని చూశారు. కానీ, వారి వెండితెర ప్లాన్ ఏదీ పోలీసుల ముందు ఏమాత్రం వర్కౌట్ కాలేదు.

డబ్బుల ఆశకు లోనుకాకుండా, ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన యూపీ పోలీసులు ఆ స్మగ్లర్లను ఎంతో దూరం వెంబడించి మరీ పట్టుకున్నారు. వారి వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వారి వద్ద నుంచి ఏకంగా 58.75 లక్షల రూపాయల విలువైన భారీ డ్రగ్స్, ఇతర వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. నేరస్థులను వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story