FASTag Local Pass: హైవే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఫాస్టాగ్ లోకల్ పాస్ ఇక యాప్‌లోనే.!

FASTag Local Pass: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రహదారి ప్రయాణికులకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసింది. ఇప్పటివరకు టోల్ ప్లాజాల

G Krishna
Published on: 18 Aug 2026 7:22 PM IST
fastag
X

fastag

FASTag Local Pass: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రహదారి ప్రయాణికులకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసింది. ఇప్పటివరకు టోల్ ప్లాజాల వద్దకు నేరుగా వెళ్లి తీసుకోవాల్సి ఉన్న ఫాస్టాగ్ లోకల్ మంత్లీ పాస్ సదుపాయాన్ని ఇకపై ఆన్‌లైన్‌లోనే పొందేలా చర్యలు చేపట్టింది. ఈ సేవలను దేశవ్యాప్తంగా దాదాపు 121 టోల్ ప్లాజాలకు విస్తరిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు

ఈ నూతన విధానం ద్వారా అర్హులైన వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలోని 'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్ ద్వారా నేరుగా లోకల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతి నెలా పాస్ రెన్యూవల్ లేదా కొత్త పాస్ కోసం టోల్ ప్లాజాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు. భౌతికంగా ఎలాంటి కాగిత పత్రాలను సమర్పించాల్సిన పనిలేకుండా, టోల్ నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ డిజిటల్ లోకల్ పాస్ విధానాన్ని మొదటగా జులై 2026లో ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 ముండ్కా-బక్కర్‌వాలా టోల్ ప్లాజా వద్ద పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. అక్కడ సాధించిన విజయం ఆధారంగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 121 కి పైగా టోల్ ప్లాజాలకు విస్తరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని టోల్ ప్లాజాలలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

అర్హతలు , నిబంధనలు

డిజిటల్ లోకల్ పాస్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, నిర్దేశిత టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక నివాసితులు మాత్రమే ఈ పాస్ పొందడానికి అర్హులుగా ఉంటారు. ఈ పాస్ పొందిన వాహనదారులు నిబంధనలకు లోబడి సదరు టోల్ ప్లాజా ద్వారా నెలకు ఎన్నిసార్లయినా ప్రయాణించే వెసులుబాటును పొందుతారు. స్థానిక నివాసితులకు టోల్ రుసుములో లభించే మినహాయింపులు లేదా రాయితీలు ఈ పాస్ ద్వారా సులభంగా వర్తిస్తాయి.

జిఐఎస్, డిజిలాకర్‌తో తక్షణ వేరిఫికేషన్

గతంలో లోకల్ పాస్ పొందాలంటే నివాస ధృవీకరణ పత్రాలు, వాహన పత్రాలను పట్టుకుని టోల్ ప్లాజా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త వ్యవస్థలో ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన డిజిలాకర్, వాహన్ ద్వారా సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సరిచూస్తారు. వాహనదారుడి నివాస చిరునామా, వాహనం వివరాలు , దానికి అనుసంధానమైన ఫాస్టాగ్ ఖాతాను సిస్టమ్ స్వయంచాలకంగా తనిఖీ చేస్తుంది. అంతేకాకుండా, దరఖాస్తుదారుడి ఇల్లు టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉందా లేదా అనేది జీఐఎస్ సాంకేతికత ద్వారా ఖచ్చితంగా నిర్ధారిస్తారు. దీనివల్ల మానవ ప్రమేయం తగ్గి, స్థానిక ప్రయాణికులకు సేవలు త్వరితగతిన అందుతాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story