Parliament: పార్లమెంట్లో హైటెన్షన్...లోక్సభ ముందుకు ఎఫ్సీఆర్ఏ బిల్లు
ఈరోజు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు రాబోతున్నాయి. విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో నియంత్రణ కోసం ఎఫ్సీఆర్సీఏ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్సభ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యంత కీలకమైన విదేశీ విరాళాల నియంత్రణ (సవరణ) బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. స్వచ్ఛంద సంస్థలు పొందే విదేశీ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం, వాటి వినియోగంపై పూర్తిస్థాయి పర్యవేక్షణ పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బిల్లును సభ ముందుకు తెస్తోంది.
ఎఫ్సీఆర్ఏ బిల్లులోని ముఖ్యాంశాలు
దేశ సార్వభౌమాధికారం, భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఈ చట్టం పనిచేస్తుంది. నూతన సవరణ ప్రకారం...ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ ప్రామాణిక గడువు ముగిసినా, లేదా ప్రభుత్వం దరఖాస్తును తిరస్కరించినా ఆ సర్టిఫికేట్ తక్షణమే రద్దవుతుంది. అదేవిధంగా విదేశీ నిధులు, వాటి ద్వారా సమకూర్చుకున్న ఆస్తుల పర్యవేక్షణ, తాత్కాలిక లేదా శాశ్వత స్వాధీనం కోసం ఒక ప్రత్యేక అధికారిక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ చట్టం భారతదేశంలోని వ్యక్తులు, ఎన్జీఓలు, ట్రస్టులు విదేశీ సొమ్మును పొందే విధానాన్ని పూర్తిగా పారదర్శకం చేస్తుంది. అయితే చట్టబద్ధంగా పనిచేసే సంస్థలపై ఇది ఎలాంటి నిషేధం విధించదు.
లోక్సభ ముందుకు మరికొన్ని కీలక బిల్లులు
కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో పలు కీలక బిల్లులను సభలో ఆమోదింపజేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026, సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026, ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ బిల్లు, మనీ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లులతో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేటాయింపుల బిల్లులను కూడా ఈ వారం పార్లమెంట్లో ఆమోదించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమైన విపక్షాలు
జూలై 20న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే నీట్-యుజి పేపర్ లీక్, జంతర్ మంతర్ ధర్నాలపై పదేపదే వాయిదా పడుతున్నాయి. తాజాగా జూలై 20న జరిగిన 'సంసద్ చలో' నిరసనలో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వాడకం, విద్యార్థులపై ఎఫ్ఐఆర్ల నమోదు అంశాలతో పాటు అయోధ్య రామమందిరం విరాళాల దొంగతనం వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహం రచిస్తున్నాయి. దీంతో ఇవాళ పార్లమెంట్లో వీటిపై చర్చకు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈరోజైనా పార్లమెంట్ సజావుగా జరుగుతుందా లేదా అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.




