Indian Railway : రైలు బోగీలో ‘శోభనం గది’ సెటప్.. నెట్టింట వైరల్ అయిన వీడియోపై రైల్వే శాఖ ఊహించని యాక్షన్

Indian Railway : నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేను 'శోభనం గది'లా అలంకరించిన ఘటనపై రైల్వే శాఖ సీరియస్ అయింది.

CR Reddy
Published on: 9 July 2026 7:34 AM IST
Indian Railway
X

Indian Railway

Indian Railway : రైలు ప్రయాణాన్ని మధురమైన జ్ఞాపకంగా మార్చుకోవాలనుకున్న ఒక కొత్త జంట చేసిన హంగామా.. ఇప్పుడు ఒక రైల్వే ఉద్యోగి ఉద్యోగానికే ఎసరు పెట్టేసింది. నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కేబిన్ను ఏకంగా శోభనం గదిలా, హనీమూన్ సూట్‌లా అలంకరించిన ఘటనపై భారతీయ రైల్వే శాఖ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ రూల్స్ బ్రేక్ చేసి, ప్రైవేట్ వ్యక్తులను రైలులోకి అనుమతించినందుకు గాను బాధ్యుడైన రైల్వే టికెట్ చెకర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. దీన్ని తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఆన్‌లైన్ డెకరేటర్లతో హనీమూన్ సూట్‌లా మార్పు

రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 6వ తేదీన రైలు నంబర్ 11002 (నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్)లో ప్రయాణిస్తున్న ఒక నూతన వధూవరులు తమ జర్నీని స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం ఒక ప్రైవేట్ ఆన్‌లైన్ డెకరేషన్ ఏజెన్సీని భారీ మొత్తానికి హయ్యర్ చేసుకున్నారు. ఈ రైలు మహారాష్ట్రలోని జాల్నా రైల్వే స్టేషన్‌లో ఆగిన సమయంలో.. సదరు ప్రైవేట్ డెకరేటర్లు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే రైలులోని ఫస్ట్ ఏసీ కూపేలోకి ప్రవేశించారు. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ కేబిన్ మొత్తాన్ని ఎర్రటి గులాబీలు, రంగురంగుల గుల్బారాలు, ఎలక్ట్రిక్ ఎల్‌ఈడీ లైట్లతో పూర్తిగా అలంకరించారు. అంతటితో ఆగకుండా లోపలి గోడపై I Love You అని పెద్ద అక్షరాలతో రాసి ఆ రూమ్‌కు సరికొత్త లుక్ ఇచ్చారు.

నెట్టింట వైరల్ అయిన వీడియో

ఈ విధంగా ముస్తాబైన ఏసీ కేబిన్ లోపలి దృశ్యాలను ఎవరో మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఇది చాలా రొమాంటిక్ ఐడియా అని, భలే ప్లాన్ చేశారంటూ కామెంట్లు పెట్టినప్పటికీ.. మెజారిటీ నెటిజన్లు మాత్రం రైల్వే రక్షణ నిబంధనలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైలు ప్రయాణంలో విద్యుత్ గొలుసులు, ప్లాస్టిక్ బెలూన్లు వాడటం వల్ల ఏ చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినా భారీ అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడేలా ఇలాంటి పనులకు అధికారులు ఎలా అనుమతిస్తారని సోషల్ మీడియా వేదికగా రైల్వే శాఖను ప్రశ్నించారు.

స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ

సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే రంగంలోకి దిగిన రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. కదిలే రైలులో ప్రైవేట్ వ్యక్తులు అనధికారికంగా చొరబడి డెకరేషన్ చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన విధి నిర్వహణలో ఉన్న టికెట్ ఎగ్జామినర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో సదరు ఉద్యోగిని తక్షణమే విధుల నుంచి తప్పించి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై మరింత లోతైన డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశించామని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులైన వారిపై మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story