డెలివరీ బాయ్ చేసిన పనికి ఫిదా.. నెటిజన్ల ప్రశంసలు

Flipkart Delivery Boy: పండుగ ఏదైనా ఇంటి గుమ్మం ముందు అందమైన రంగోలి వేయడానికి గంటల తరబడి శ్రమిస్తాం. ఎవరైనా పొరపాటున దానిపై కాలు వేసి పాడుచేస్తే కోపం రావడం సహజం.

G Krishna
Published on: 9 Nov 2026 5:31 PM IST
Flipkart Delivery Boy
X

డెలివరీ బాయ్ చేసిన పనికి ఫిదా.. నెటిజన్ల ప్రశంసలు

Flipkart Delivery Boy: పండుగ ఏదైనా ఇంటి గుమ్మం ముందు అందమైన రంగోలి వేయడానికి గంటల తరబడి శ్రమిస్తాం. ఎవరైనా పొరపాటున దానిపై కాలు వేసి పాడుచేస్తే కోపం రావడం సహజం. కానీ, ముంబైలో ఒక ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది. పొరపాటున రంగోలి చెదిరిపోతే, ఎవరూ అడగకపోయినా తానే స్వయంగా దానిని సరిదిద్దిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ముంబైకి చెందిన దృష్టి అనే యువతి తన ఇంటి సీసీటీవీ రికార్డింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. ఒక ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ పార్సెల్ ఇవ్వడానికి ఆమె ఇంటికి వస్తాడు. దృష్టి పార్సెల్ తీసుకుని లోపలికి వెళ్లిన తర్వాత, అక్కడి నుంచి వెళ్లే క్రమంలో ఆ డెలివరీ బాయ్ కాలు తలుపు ముందున్న అందమైన రంగోలిపై పడి కొద్దిగా పాడవుతుంది.

కొద్ది దూరం వెళ్లిన తర్వాత తన వల్ల రంగోలి పాడైందని గ్రహించిన ఆ యువకుడు వెనక్కి వస్తాడు. నేలపై కూర్చుని తన చేతులతోనే పాడైన డిజైన్‌ను మళ్లీ అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. రంగోలి మళ్లీ చక్కగా వచ్చే వరకు అక్కడే కూర్చుని దాన్ని సరిచేసి వెళ్లిపోతాడు.

సీసీటీవీ చూసి భావోద్వేగానికి గురైన ఓనర్

తాను ఎంతో కష్టపడి వేసిన రంగోలి చెడిపోవడంతో.. తర్వాత ఇంటికి వచ్చిన దృష్టికి డిజైన్ మారిపోవడం గమనించి ఆశ్చర్యమేసింది. వెంటనే ఆమె సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అసలు విషయం తెలిసింది. డెలివరీ బాయ్ తన తప్పును సరిదిద్దడానికి పడిన శ్రమను చూసి ఆమె ఎంతో భావోద్వేగానికి, ఆనందానికి గురయ్యారు. ఎవరూ అడగకుండానే బాధ్యతగా ప్రవర్తించిన ఆ డెలివరీ ఏజెంట్ మంచి మనసు తన రోజంతా సంతోషంగా గడిచేలా చేసిందని ఆమె పేర్కొన్నారు.

@drashtiisthisyouu అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 38 లక్షల మంది వీక్షించగా, 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. "మానవత్వం ఇంకా బతికే ఉందంటూ" నెటిజన్లు ఆ డెలివరీ బాయ్ నిజాయితీని, మంచి మనసును తెగ ప్రశంసిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.