Nirmala Sitharaman: భారత్‌లో 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
Nirmala Sitharaman: పేదరికం నిర్వచనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nirmala Sitharaman: భారత్‌లో 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
Nirmala Sitharaman: పేదరికం నిర్వచనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికం కాదని, ఇల్లు, తాగునీరు, వైద్యం వంటి కనీస ప్రాథమిక అవసరాలకు నోచుకోలేకపోవడం కూడా పేదరికం కిందకే వస్తుందని ఆమె పేర్కొన్నారు. 2011–2023 మధ్య కాలంలో భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది కటిక పేదరికాన్ని జయించారంటూ ప్రపంచ బ్యాంకు నివేదిక వెలువరించిన నేపథ్యంలో, నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదిక ‘లింక్డ్‌ఇన్’ లో ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు.
ఒక్క అనారోగ్యం కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టేస్తుంది
ప్రజలకు ఇల్లు, స్వచ్ఛమైన తాగునీరు వంటి ప్రాథమిక వసతులు అందుబాటులో ఉండాలని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. "ఒక్క తీవ్రమైన అనారోగ్యం ఒక మధ్యతరగతి లేదా పేద కుటుంబాన్ని తిరిగి కటిక పేదరికంలోకి నెట్టేస్తుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గత దశాబ్ద కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలు, చొరవతోనే భారత్ పేదరికాన్ని సమర్థవంతంగా అధిగమించిందని గుర్తుచేశారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.
చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు
ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రూపొందించే పథకాలు చివరి లబ్ధిదారుడికి చేరే వరకు ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తారని నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘అంత్యోదయ’ లక్ష్యంతో స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ముద్ర రుణాలు వంటి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇదే స్ఫూర్తితో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణమే లక్ష్యంగా మోదీ సర్కారు పనిచేస్తోందన్నారు.
మహిళా సాధికారతకు ప్రతీకలుగా ఇద్దరి ప్రస్తావన
ప్రభుత్వ పథకాలతో జీవితాలు మార్చుకున్న ఇద్దరు మహిళల విజయగాథలను ఆర్థిక మంత్రి తన పోస్టులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాగాలాండ్‌లోని కిఫిరే జిల్లాలో చిరుధాన్యాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ ఆర్థికంగా ఎదిగిన ‘లఖ్‌పతి దీదీ’ ఎస్థర్, అలాగే ‘ముద్ర రుణం’ సహాయంతో తమ కుటుంబ ప్రింటింగ్ వ్యాపారాన్ని తిరిగి నిలబెట్టుకున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుష్మితా ఘరాయ్ స్ఫూర్తిదాయక ప్రయాణాలను ఆమె కొనియాడారు.




