Cyclonic: ఏపీకి మరో ముప్పు ..1987 నాటి పరిస్థితులే కారణమా..?

Cyclonic: ‘అక్వాన్’ తుఫాను బలహీనపడిన వెంటనే బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకోనుంది.

Gagan kumar
Published on: 22 Nov 2026 3:44 PM IST
Cyclonic
X

Cyclonic: ఏపీకి మరో ముప్పు ..1987 నాటి పరిస్థితులే కారణమా..?

Bay of Bengal: వరుస తుఫాన్లతో అతలాకుతలమవుతున్న తీర ప్రాంత ప్రజలకు భారత వాతావరణ శాఖ మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇటీవలే తీరం దాటిన ‘అక్వాన్’ తుఫాను బలహీనపడి అంతర్గత ఒడిశా మీదుగా అల్పపీడనంగా మారినప్పటికీ, బంగాళాఖాతంలో వాతావరణ అలజడి ఇంకా సద్దుమణగలేదు. నవంబర్ చివరి నాటికి అండమాన్ సముద్రం , ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా మరో కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది.

ఐఎండీ విడుదల చేసిన తాజా రెండు వారాల వాతావరణ అంచనా నివేదికలో ఈ సంభావ్య ఉపరితల ఆవర్తనం గురించి ప్రస్తావించారు. అయితే, ఈ కొత్త వాతావరణ వ్యవస్థ కచ్చితంగా ఎక్కడ ఏర్పడుతుంది, దాని తీవ్రత ఎంత ఉంటుంది, ఏ దిశగా ప్రయాణిస్తుంది అనే విషయాలపై ఇప్పుడే ఒక నిర్దిష్ట అంచనాకు రాలేమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర స్పష్టం చేశారు. దీనిపై ఇప్పుడే పూర్తి స్థాయి అంచనాలు వేయడం తొందరపాటు అవుతుందని, ప్రజలు , అధికారులు వాతావరణ శాఖ విడుదల చేసే తదుపరి బులెటిన్‌లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఈ ఏడాది బంగాళాఖాతంలో వరుసగా తుఫాన్లు ఏర్పడటానికి గల కారణాలను మృత్యుంజయ్ మహాపాత్ర విశ్లేషించారు. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో బంగాళాఖాతంలో నాలుగు నుంచి ఐదు తుఫాన్లు ఏర్పడుతుంటాయి. కానీ ఈ ఏడాది ఇప్పటికే మూడు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలను తాకాయి. ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు 1987 నాటి బలమైన ‘ఎల్ నినో’ సంవత్సరంతో చాలా వరకు పోలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఇలా వరుస తుఫాన్లు ఏర్పడటానికి ఈ ఎల్ నినో ప్రభావం కూడా ఒక ప్రధాన కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.

ఒకదాని వెంట ఒకటిగా విరుచుకుపడుతున్న తుఫాన్లతో ఇప్పటికే పంటలు, ఆస్తులు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంత ప్రజలు, రైతుల్లో ఈ తాజా వాతావరణ హెచ్చరిక మరింత ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ చివరి వారంలో ఏర్పడనున్న ఈ ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.