LPG: గ్యాస్ పైపును ఎన్నాళ్లకోసారి మార్చాలో తెలుసా? ఆసక్తికర విషయాలు ఇవిగో!
LPG: గ్యాస్ పైపుకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. 18 నుంచి 24 నెలలకే మార్చాలని కంపెనీలు సూచిస్తున్నాయి.
LPG: గ్యాస్ పైపును ఎన్నాళ్లకోసారి మార్చాలో తెలుసా? ఆసక్తికర విషయాలు ఇవిగో!
LPG: గ్యాస్ సిలిండర్ పైపుకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ పైపును 18 నుంచి 24 నెలలు మాత్రమే వాడాలని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. పైపు బాగానే ఉంది కదా అని నిర్లక్ష్యం చేయొద్దని, గడువు తీరగానే మార్చాలని సూచిస్తున్నాయి. పాత పైపునే వాడితే పగుళ్లు వచ్చి, గ్యాస్ లీకై అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. వేడి, ఒత్తిడి వల్ల కాలక్రమేణా పైపు గట్టిపడి పెళుసుగా మారుతుంది. దీంతో బయటకు బాగానే కనిపించినా లోపల దెబ్బతిని లీకేజీకి దారితీసే అవకాశం ఉంటుంది.
గతంలో చాలా ఇళ్లలో సాధారణ రబ్బరు గొట్టాలు, ఆకుపచ్చ రంగు పైపులు వాడేవారు. వాటి స్థానంలో ఇప్పుడు ఆరెంజ్ రంగు సురక్షా ఎల్‌పీజీ హోస్ అందుబాటులో ఉంది. గృహ, వాణిజ్య అవసరాల కోసం రూపొందించిన IS 9573 పార్ట్ 2 ప్రమాణాలకు అనుగుణంగా ఈ పైపు తయారవుతుంది. పైపుపై తయారీ తేదీ ముద్రించి ఉంటుంది. దాన్ని చూసి ఎప్పుడు మార్చాలో సులభంగా తెలుసుకోవచ్చు. కొత్త పైపు కొనేటప్పుడు ISI మార్క్ ఉన్నదే తీసుకోవాలని అధికారిక మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ISI మార్క్ లేని పైపులు నాణ్యతలో తేడా ఉండి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది.
సిలిండర్ మార్చిన ప్రతిసారి పైపుపై పగుళ్లు, గీతలు, గట్టిపడిన భాగాలు ఉన్నాయేమో చూడాలి. పైపు కనిపించేలా ఉంచాలి, దాచిపెడితే దెబ్బతిన్నా గుర్తించలేం. రాత్రి పడుకునే ముందు రెగ్యులేటర్ ఆఫ్ చేయడం మంచిది. సిలిండర్‌ను నిలువుగా, స్టవ్ కంటే కింది స్థాయిలో ఉంచాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన మార్గదర్శకాల ప్రకారం గ్యాస్ కనెక్షన్‌ను రెండేళ్లకోసారి తనిఖీ చేయించుకోవాలి. పైపుపై పగుళ్లు కనిపిస్తే గడువు కంటే ముందే మార్చుకోవాలి. ఇలా చిన్న జాగ్రత్తలు పాటిస్తే వంటగదిలో ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చు.




