Gautam Adani: ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశతో చూస్తోంది.. మేడే సందర్భంగా ఆదానీ కీలక ప్రసంగం
Gautam Adani: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్.
Gautam Adani: ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశతో చూస్తోంది.. మేడే సందర్భంగా ఆదానీ కీలక ప్రసంగం
Gautam adani: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్. ప్రపంచంలోనే 15వ అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ ఆదానీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆదానీ మాట్లాడుతూ.. నా ప్రియమైన సహచరులారా, నమస్కారం. “మన మాట – మనవాళ్లతో” అనే భావంతో ఈ సంభాషణను ప్రారంభిస్తున్నాం. జీవితం అనేది గతం, వర్తమానం, భవిష్యత్తు కలిసిన నిరంతర ప్రయాణం. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ప్రస్తుతం అర్థం చేసుకుంటూ, భవిష్యత్తును నిర్మించుకోవడం మన బాధ్యత. అదానీ గ్రూప్ అభివృద్ధి కూడా ఇదే ఆలోచనపై ముందుకు సాగింది. ప్రతి అనుభవం, ప్రతి నిర్ణయం మనకు ఒక పాఠంలా మారింది. ఒక కుటుంబంలా కలిసి ఈ ఆలోచనలను పంచుకుంటూ ముందుకు వెళ్లాలి.
కార్మిక దినోత్సవం ప్రాముఖ్యత
ఈ రోజు కష్టపడే ప్రతి ఒక్కరి రోజు. శ్రమపై విశ్వాసం ఉన్నవారి రోజు. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారి రోజు. జీవితంలో ఎదగాలని తపన ఉన్న ప్రతి మనిషి ఈ రోజును గర్వంగా భావించాలి. అందుకే ఈ రోజు నా రోజు, మీ రోజు, మన అందరి రోజు అని భావించాలి. అని చెప్పుకొచ్చారు.
వ్యక్తిగత భావోద్వేగం
ఆదానీ ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ప్రత్యేకం. 1986 మే 1న నేను ప్రీతి గారితో వివాహ బంధంలో అడుగుపెట్టాను. అదే రోజు ఈ రోజు కావడం మరింత ఆనందంగా ఉంది. ఈ ఉదయం మేము కలిసి కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకున్నాం. దేశం అభివృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాం. అలాగే కొత్త ఉత్సాహంతో మరింత పెద్ద లక్ష్యాల కోసం పని చేయాలని సంకల్పించుకున్నాం.
అభివృద్ధి దిశలో భారత్
భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత దాదాపు ఎనభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశతో చూస్తోంది. మన దేశం అభివృద్ధి దిశలో వేగంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ లక్ష్యం ఒకరితో సాధ్యం కాదు. దేశంలోని ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాల్సిందే. అదానీ గ్రూప్ కూడా ఈ బాధ్యతను అర్థం చేసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతోందని అన్నారు.
చిన్న సహాయం కూడా ముఖ్యమే – ఉడుత
రామాయణంలో ఒక చిన్న ఉడుత కథ మనకు గొప్ప పాఠం చెబుతుంది. సముద్రంపై వంతెన నిర్మిస్తున్నప్పుడు పెద్ద పెద్ద వానరాలు రాళ్లు వేస్తుంటే, ఒక చిన్న ఉడుత ఇసుక కణాలు వేస్తూ తన వంతు సహాయం చేసింది. తన సహాయం చిన్నదైనా, నేను నా వంతు చేశాను అని చెప్పగలగాలి అనే భావన ఆమెకు ఉంది. ఇదే మనం నేర్చుకోవాల్సిన విషయం. మన సహాయం చిన్నదైనా, అది ముఖ్యమే.
ప్రతి పని – దేశ నిర్మాణమే
మన పని కేవలం ఉద్యోగం కాదు. మనం చేసే ప్రతి పని దేశ భవిష్యత్తును నిర్మించే ఒక భాగం. ఒకప్పుడు ఖాళీ భూమిగా ఉన్న ముండ్రా ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పోర్ట్‌గా మారింది. అలాగే విజింజం పోర్ట్ భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తోంది. ఖావడాలో నిర్మిస్తున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ భవిష్యత్తు తరాలకు శుభ్రమైన శక్తిని అందించనుంది. నవి ముంబై ఎయిర్‌పోర్ట్ దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుంది. ఇవన్నీ కేవలం ప్రాజెక్టులు కాదు, దేశ పురోగతికి సంకేతాలు అని అన్నారు.
గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాముఖ్యత
గంగా ఎక్స్‌ప్రెస్‌వే దేశ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగన్న ఆదానీ.. ఇది కేవలం రహదారి కాదు, కోట్లాది మంది జీవితాలను కలిపే మార్గం అన్నారు. ప్రయాణ సమయం తగ్గించడం ద్వారా ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగుతుంది. అవసరమైతే యుద్ధ విమానాలు దిగేలా నిర్మించడం ద్వారా దేశ రక్షణలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది కొత్త భారతదేశం సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు.
ధారావి ప్రాజెక్ట్ – పెద్ద సవాలు
ధారావి పునర్నిర్మాణం గురించి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల్లో ఒకటి. ఇది లాభం కోసం కాదు, సమాజానికి తిరిగి ఇవ్వాలనే బాధ్యతతో తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారికి గౌరవప్రదమైన జీవితం అందించడం లక్ష్యం. ఈ సవాలు ఎంత కష్టమైనదైనా, దాన్ని స్వీకరించడం మా బాధ్యతగా భావించాం.
అదానీ గ్రూప్ అభివృద్ధి ప్రయాణం
ఒకప్పుడు కేవలం 20 మంది తో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు 4 లక్షల మందికి పైగా చేరుకుంది. ఈ మార్పు ఎంతో గర్వకారణం. గతంలో దశాబ్దాల పాటు సంపాదించిన సంపదను ఇప్పుడు ఒకే సంవత్సరంలో సాధించగలుగుతున్నాం. ఇది సంఖ్యల విషయం కాదు, ఇది ప్రతి ఉద్యోగి కష్టానికి నిదర్శనం.
సంస్థలో మూడు ముఖ్య మార్పులు
సంస్థను మరింత బలంగా చేయడానికి మూడు ప్రధాన మార్పులపై దృష్టి పెట్టాం. మొదటిది 3-లేయర్ మోడల్. దీని ద్వారా నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు, పని త్వరగా పూర్తవుతుంది. రెండోది పార్ట్‌నర్‌షిప్ మోడల్. ఇందులో ఉద్యోగులతో పాటు భాగస్వాములు కలిసి పనిచేస్తారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన హాధుభాయ్ లాంటి వారు ఈ మార్పుకు ఉదాహరణ. మూడోది లెర్నింగ్, డెవలప్‌మెంట్. ప్రతి ఒక్కరికీ నేర్చుకునే అవకాశాలు ఇవ్వడం ద్వారా వారు ఎదగగలుగుతారు. సుబ్బు కథ ఈ మార్పును స్పష్టంగా చూపిస్తుంది.
సంస్థ పంచతత్వం
మా సంస్థను నిలబెట్టే ఐదు ప్రధాన విలువలు ఉన్నాయి. స్థానికులకు అవకాశాలు ఇవ్వడం, ఉద్యోగులకు నిరంతర శిక్షణ అందించడం, స్పష్టమైన కెరీర్ ఎదుగుదల మార్గం కల్పించడం, సరైన జీతం ఇవ్వడం, గౌరవంతో జీవించే పరిస్థితులు కల్పించడం ఇవి ప్రధాన లక్ష్యాలు. ముండ్రా, ఖావడా ప్రాంతాల్లో వేలాది మందికి నివాసం, ఆహారం వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం.
మా సంస్థ – ఒక చిన్న భారతదేశం
మా సంస్థలో దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు కలిసి పని చేస్తున్నారు. భాషలు, సంస్కృతులు వేరు అయినా అందరి లక్ష్యం ఒకటే. అందరూ కలిసి పనిచేసినప్పుడు అది కేవలం ప్రాజెక్టుల నిర్మాణం కాదు, దేశ నిర్మాణం అవుతుంది.
ఇక స్పీచ్ ముగిస్తూ ఆదానీ తన ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు. మీరు కేవలం ఉద్యోగులు కాదు. మీరు దేశ నిర్మాణంలో భాగస్వాములు. మన పని కేవలం జీవనోపాధి కాదు, దేశానికి సేవ. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మనం ఈ బాధ్యతను గుర్తు చేసుకోవాలని అన్నారు. జై హింద్, జై భారత్ అంటూ స్పీచ్ ముగించారు.




