డిజిటల్ అరెస్ట్ నుంచి రూ.150 కోట్ల స్కామ్ వరకు.. గ్రాఫిక్ డిజైనర్ షాకింగ్ స్టోరీ
Digital Arrest Scam: ఒకప్పుడు డిజిటల్ అరెస్ట్ స్కామ్ బారిన పడి తృటిలో బయటపడ్డ ఒక గ్రాఫిక్ డిజైనర్.. అదే అనుభవంతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
డిజిటల్ అరెస్ట్ నుంచి రూ.150 కోట్ల స్కామ్ వరకు.. గ్రాఫిక్ డిజైనర్ షాకింగ్ స్టోరీ
Digital Arrest Scam: ఒకప్పుడు డిజిటల్ అరెస్ట్ స్కామ్ బారిన పడి తృటిలో బయటపడ్డ ఒక గ్రాఫిక్ డిజైనర్.. అదే అనుభవంతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. సైబర్ కేటుగాళ్లకు టెక్నాలజీ సాయం చేస్తూ దేశవ్యాప్తంగా వేలాది మందిని నిలువునా ముంచేశాడు. ఏకంగా 150 కోట్ల రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా మారిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన సంచలన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 36 ఏళ్ల పంకజ్ గుప్తా వృత్తిరీత్యా గ్రాఫిక్ డిజైనర్. కోడింగ్ పై మంచి పట్టు ఉన్న అతనికి ఐదేళ్ల క్రితం ఒక డిజిటల్ అరెస్ట్ మోసంలో నష్టపోయే పరిస్థితి ఎదురైంది. అయితే ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న పంకజ్.. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఈ సైబర్ నేరాలపై భయపడటం చేయలేదు. సరిగ్గా అక్కడే అసలు ఆలోచన చేశాడు. సైబర్ నేరగాళ్ల మోసాల వెనుక ఉన్న టెక్నాలజీని గమనించిన అతను, దానినే తనకు అనుకూలంగా మార్చుకుని డబ్బు సంపాదించే సులువు మార్గంగా ఎంచుకున్నాడు.
బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో సైబర్ నెట్‌వర్క్‌లు
దీనికోసం బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉన్న సైబర్ నెట్‌వర్క్‌లను సంప్రదించాడు. సైబర్ ఫ్రాడ్ చేసేవారికి సరిపోయేలా సరికొత్త నకిలీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ (APK) ఫైళ్లను రూపొందించడం ప్రారంభించాడు. ఏపీకే (Android Package Kit) అనేది ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్‌లను ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగించే ఫైల్. కానీ పంకజ్ తయారు చేసినవి సాధారణ యాప్‌లు కావు. ఇవి టార్గెట్ చేసిన వారి స్మార్ట్ఫోన్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే డిజిటల్ రిమోట్ కంట్రోల్స్లా పనిచేస్తాయి. వీటి ద్వారా ఫోన్లోని సున్నితమైన డేటా చోరీకి గురవడంతో పాటు, ఓటీపీలు నేరగాళ్ల చేతికి చిక్కుతాయి.
ఇలాంటి ప్రమాదకరమైన 2,805 మాల్వియస్ ఏపీకే ఫైళ్లను పంకజ్ గుప్తా సృష్టించి సైబర్ నేరగాళ్లకు సరఫరా చేశాడు. సీనియర్ సిటిజన్ కార్డ్ వెరిఫికేషన్, ఈ-ట్రాఫిక్ చలాన్లు, పెన్షన్ వెరిఫికేషన్, క్రెడిట్ కార్డ్ అప్డేట్స్ , పీఎం కిసాన్ యోజన వంటి ప్రజాధారణ పొందిన ప్రభుత్వ, సేవా రంగాల పోర్టల్స్లాగే కనిపించే నకిలీ యాప్‌లను అతను డిజైన్ చేశాడు. ప్రతి ఏపీకే ఫైల్‌ను స్థానిక కాలింగ్ గ్రూప్‌లకు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు విక్రయించాడు. అంతేకాదు, ఈ నకిలీ యాప్‌ల ద్వారా సేకరించిన డేటాను భద్రపరిచేందుకు వివిధ కంపెనీల నుంచి ప్రత్యేక సర్వర్లను కూడా అద్దెకు తీసుకున్నాడు.
ఓ సీనియర్ సిటిజన్ ఫిర్యాదు
ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముంబైలోని బైకల్లా ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు కారణమైంది. నేషనలైజ్డ్ బ్యాంక్ ప్రతినిధిగా నటిస్తూ సీనియర్ సిటిజన్ కార్డ్ ఇప్పిస్తామని నమ్మించిన కేటుగాళ్లు.. బాధితుడికి ఒక ఏపీకే లింక్ పంపారు. ఆ లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేయగానే అతని అకౌంట్ నుంచి రూ. 5.62 లక్షలు మాయమయ్యాయి. దీనిపై రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా దర్యాప్తు చేసి ఇండోర్‌లో ఉన్న పంకజ్ గుప్తాను అరెస్టు చేసింది.
పోలీసుల దర్యాప్తులో మరింత దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. బ్యాంకులతో పాటు వివిధ సంస్థల నుంచి లీకైన డేటాను ఉపయోగించి ఈ సైబర్ సిండికేట్ దేశవ్యాప్తంగా ఏకంగా 9,673 మందిని టార్గెట్ చేసింది. జాతీయ సైబర్ పోర్టల్ ‘130’లో ఈ నెట్‌వర్క్‌పై 1,074 ఫిర్యాదులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్రలోనే 142 కాగా, ముంబైలో 36 కేసులు నమోదయ్యాయి. ఈ నకిలీ సాఫ్ట్వేర్ సాయంతో ఈ ముఠా దేశవ్యాప్తంగా దాదాపు రూ. 150 కోట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు తేల్చారు.
ఒకప్పుడు డిజిటల్ మోసానికి బలయ్యే స్థితి నుంచి తప్పించుకున్న వ్యక్తి.. నేడు స్వయంగా వేలాది మందిని ముంచే టెక్సాఫ్ట్వేర్ తయారీదారుడిగా మారడం అందరినీ విస్మర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌కు సహకరించిన స్థానిక వ్యక్తులు , ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.




