Bus Fire: పొగ వస్తున్నా పట్టించుకోలేదు.. బీడీలు తాగుతూ నిండు ప్రాణాలను బలిగొన్న డ్రైవర్, కండక్టర్!

Bus Fire: గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం జరిగి 9 మంది సజీవ దహనమయ్యారు.

Arun Chilukuri
Published on: 24 Sept 2026 12:27 PM IST
Bus Fire
X

Bus Fire: పొగ వస్తున్నా పట్టించుకోలేదు.. బీడీలు తాగుతూ నిండు ప్రాణాలను బలిగొన్న డ్రైవర్, కండక్టర్!

Bus Fire: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలోనే బస్సంతా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. కొందరు ప్రయాణికులు ప్రాణభయంతో బస్సు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకోగా, మరికొందరు మంటల్లో చిక్కుకుని బలయ్యారు.

డ్రైవర్, కండక్టర్ తీవ్ర నిర్లక్ష్యం.. ఎఫ్‌ఐఆర్‌లో విస్తుపోయే నిజాలు:

ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. బస్సు ప్రయాణం ప్రారంభించిన 33 కి.మీ. దూరం వెళ్ళిన తర్వాత డ్రైవర్ క్యాబిన్ నుంచి పొగ రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. కాలుతున్న వాసన వస్తోందని డ్రైవర్, కండక్టర్‌ను హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోలేదు.

ప్రయాణికులు ఎంత మొత్తుకున్నా డ్రైవర్, కండక్టర్ బస్సు ఆపి ఎలాంటి తనిఖీ చేయలేదు. పైగా ప్రయాణిస్తున్నంత సేపు వారు సిగరెట్లు, బీడీలు తాగడం ఆపలేదని తేలింది.

కొద్ది నిమిషాలకే డ్రైవర్ సీటు వద్ద మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు బస్సు ఆపాలంటూ కేకలు వేశారు. అయితే వాహనాన్ని ఆపకపోగా, వారు ప్రయాణికులను బెదిరించినట్లు బాధితులు వాపోయారు.

ప్రమాదానికి గురైన ఈ బస్సుపై రూ. 1.75 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మైనర్‌ ఈ వాహనాన్ని నడిపినందుకు కూడా అపరాధ రుసుం ఉన్నట్లు తేలింది. బస్సు యజమానిది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంగా పోలీసులు నిర్ధారించారు. కాగా, నిందితులైన డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.