Honeymoon: హనీమూన్‌కు తీసుకెళ్లిన భర్త..విడాకులు కోరిన భార్య.. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది
Honeymoon: పెళ్లయ్యాక భర్తతో ఏకాంతంగా గడపాలని ఆశపడిన భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు భర్త.
Honeymoon: హనీమూన్‌కు తీసుకెళ్లిన భర్త..విడాకులు కోరిన భార్య.. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది
Divorce: సినిమా వేరు.. నిజ జీవితం వేరు అని పెద్దలు ఊరికే అనలేదు. వెండితెరపై చూసే కొన్ని సీన్లు ముచ్చటగా అనిపించినా, అవే సీన్లు రియల్ లైఫ్‌లో రిపీట్ అయితే మాత్రం జీవితాలు తలకిందులవుతాయి. బాలీవుడ్ సూపర్ హిట్ కుటుంబ కథా చిత్రం ‘హమ్ సాథ్ సాథ్ హైన్’ గుర్తుందిగా? అందులో హీరోయిన్ టబు పెళ్లయ్యాక, తన భర్తతో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని వెంటబెట్టుకుని హనీమూన్‌కు వెళ్తుంది. సినిమాలో ఈ సీన్ చూసి అబ్బా.. ఎంత మంచి కుటుంబం అనుకున్నారు ప్రేక్షకులు. కానీ, సరిగ్గా ఇదే సీన్‌ను రియల్ లైఫ్‌లో రీ-క్రియేట్ చేయాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. ఫలితంంగా పెళ్లైన కొత్తలోనే కాపురం కాస్తా కోర్టు మెట్లు ఎక్కింది.
ఢిల్లీలోని పటేల్ నగర్‌కు చెందిన ఒక యువకుడు సింగపూర్‌లో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ చదివాడు. అతనికి మీరట్ జిల్లాకు చెందిన ఒక గ్రాడ్యుయేట్ యువతితో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా వివాహం నిశ్చయమైంది. ఘనంగా పెళ్లి జరిగింది. కోటి ఆశలతో ఆ నూతన వధువు అత్తవారింట్లో అడుగుపెట్టింది. భర్తతో ఏకాంతంగా గడపాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని సదరు వధువు ఎన్నో కలలు కంది. అందుకోసం ఈ కొత్త జంట ఒక అద్భుతమైన హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకుంది. ఇక్కడివరకు అంతా సాఫీగానే సాగింది.. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.
భార్యకు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడో ఏమో కానీ.. ఆ యువకుడు హనీమూన్ టికెట్లు బుక్ చేసేటప్పుడు తనతో పాటు తన తల్లిదండ్రులు, సోదరి, సోదరుడికి కూడా టికెట్లు బుక్ చేశాడు. తీరా ప్రయాణ సమయానికి భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు, బావమరిది అంతా లగేజ్ సర్దుకుని రెడీగా ఉండేసరికి ఆ నూతన వధువు మైండ్ బ్లాంక్ అయిపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రైవేట్ టైమ్ స్పెండ్ చేయాల్సిన హనీమూన్ కాస్తా.. ఫ్యామిలీ టూర్‌గా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా వెనుక ఫ్యామిలీ బ్యాచ్ రెడీగా ఉండటంతో, భర్తతో మనసు విప్పి మాట్లాడే అవకాశం కూడా ఆ భార్యకు దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురికావడమే కాకుండా, ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
హనీమూన్ అనేది ఇద్దరు వ్యక్తులు తమ జీవితాన్ని పంచుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దొరికే ఒక ప్రైవేట్ స్పేస్. దాన్ని ఫ్యామిలీ పిక్నిక్‌లా మార్చేస్తే ఎలా? అని సదరు భార్య వాపోతోంది. ట్రిప్ ముగిసి ఇంటికొచ్చాక కూడా వీరి మధ్య వివాదం సర్దమణగలేదు. ఇలాంటి ఆలోచనలు ఉన్న భర్తతో తాను వేగలేనంటూ ఆ యువతి ఏకంగా విడాకుల కోసం కోర్టుకెక్కింది. అయితే భర్త వాదన మాత్రం మరోలా ఉంది. తన కుటుంబం అంతా సంతోషంగా కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అందరినీ తీసుకెళ్లానని, ఇందులో తన తప్పేమీ లేదని అతడు వాదిస్తున్నాడు. ఈ వ్యవహారంపై కోర్టులో కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ లాభం లేకుండా పోయింది.




