Gurugram Encounter: గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం!

Gurugram Encounter: హరియాణాలోని గురుగ్రామ్‌లో అర్ధరాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

Arun Chilukuri
Published on: 10 July 2026 10:39 AM IST
Gurugram Encounter
X

Gurugram Encounter: గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం!

Gurugram Encounter: హరియాణాలోని గురుగ్రామ్‌లో గురువారం అర్ధరాత్రి పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య ఘోర ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో జరిగిన ఈ హైడ్రామాలో ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌ దీపక్‌ నందల్‌ ముఠాకు చెందిన నలుగురు షూటర్లు అక్కడికక్కడే హతమయ్యారు. ఈ కాల్పుల పోరులో ముగ్గురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా అత్యాధునిక ఆయుధాలను, గుండ్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ కారులో కొందరు సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) నుంచి క్రైమ్ బ్రాంచ్ బృందాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే సుశాంత్ లోక్ ప్రాంతంలో ఉండే ఒక ప్రముఖ వ్యాపారవేత్త నివాసంపై కొందరు షూటర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ బృందం.. దుండగులను చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరించింది. అయితే, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నిందితులు వారిపైకి ఎదురుకాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విదేశాల్లో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్‌ నందల్‌ నుంచి సదరు వ్యాపారవేత్తకు గత కొన్ని రోజులుగా పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గ్యాంగ్‌స్టర్ ఆదేశాల మేరకే ఈ షూటర్లు వ్యాపారిని హతమార్చడానికి లేదా భయభ్రాంతులకు గురిచేయడానికి అక్కడకు వచ్చినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో వ్యాపారవేత్త నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story