UP Tragedy: అర్థరాత్రి కుప్పకూలిన బ్రిడ్జి.. ఆరుగురు మృతి.. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్!
UP Tragedy: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.
UP Tragedy
UP Tragedy: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ప్రమాదం చోటుచేసుకుంది. బెత్వా నదిపై నిర్మిస్తున్న ఒక వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో వంతెన శిథిలాల కింద నలిగిపోయి ఆరుగురు నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది కార్మికులు ఇంకా ఆ బ్రిడ్జి కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.
హమీర్‌పూర్ జిల్లాలోని కురారా పోలీస్ స్టేషన్ పరిధిలో గల మోరకందర్ పరసాని నుంచి నైథీ గ్రామం వరకు బెత్వా నదిపై ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న వంతెనకు సంబంధించిన సటరింగ్, స్లాబ్, పిల్లర్ కోఠి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు కూలీలు ఆ వంతెన కిందనే నిద్రిస్తూ ఉండటంతో, వారికి అసలు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. నిద్రలోనే వారు కానరాని లోకాలకు చేరుకున్నారు.
వంతెన కూలిపోయిన సమయంలో ఆ ప్రాంతంలో భీకరమైన శబ్దం వచ్చిందని స్థానిక గ్రామస్తులు తెలిపారు. ఈ శబ్దానికి భయాందోళనకు గురైన చుట్టుపక్కల ప్రజలు వెంటనే ప్రమాద స్థలానికి పరుగులు తీశారు. బ్రిడ్జి కింద చిక్కుకున్న కూలీలను బయటకు తీసేందుకు స్థానికులు మొదట తమ వంతు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ జేసీబీలు, అధునాతన యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నాయి. ఘటనా స్థలంలో ఎస్డీఎం, సీఓ సహా భారీగా పోలీస్ బలగాలు మొహరించాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు కార్మికుల వివరాలను అధికారులు గుర్తించారు. మృతుల్లో బాందా జిల్లా చిల్లా పరిధికి చెందిన లోకేంద్ర నిషాద్, కుల్దీప్ నిషాద్, భూరాగఢ్‌కు చెందిన సావంత్ యాదవ్, సభాజీత్ ఉన్నారు. అలాగే హమీర్‌పూర్ జిల్లా లల్‌పూర్ పరిధిలోని స్వాసా ఖుర్ద్ గ్రామానికి చెందిన పుష్పేంద్ర సింగ్ చౌహాన్, అచ్పురా గ్రామానికి చెందిన రాజేష్ పాల్ (42)లు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఈ కూలీలంతా తమ స్వగ్రామమైన మోరకందర్ పరసాని పరిసరాల్లోనే వంతెన పనులు జరుగుతుండటంతో అక్కడే ఉంటూ పని చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది, వారి రోదనలు మిన్నంటాయి.
వంతెన కూలిపోవడంతో అక్కడి భద్రతా ప్రమాణాలు, నిర్మాణ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం గాలి వానకే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్లతో సహా కూలిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




