Har Ghar Tiranga 2026: దేశభక్తికి డిజిటల్ గుర్తింపు... హర్‌ఘర్ తిరంగా సెల్ఫీ దిగండి... సర్టిఫికెట్ పొందండి
దేశవ్యాప్తంగా హర్‌ఘర్ తిరంగా ప్రచారాన్ని కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ జెండాతో ఫొటో దిగి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా సర్టిఫికెట్‌ను పొందవచ్చు.
Har Ghar Tiranga 2026: భారతదేశం తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న శుభతరుణంలో, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'హర్ ఘర్ తిరంగా 2026' ప్రచారాన్ని ప్రకటించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుండి ఆగస్టు 17 వరకు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా సాగనుంది. ప్రతీ పౌరుడు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే కాకుండా, జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి ప్రభుత్వం అందించే అధికారిక డిజిటల్ సర్టిఫికెట్‌ను ఉచితంగా పొందవచ్చు.
సెల్ఫీ సర్టిఫికెట్‌ను ఎలా పొందాలి
త్రివర్ణ పతాకంతో సెల్ఫీని నమోదు చేసి డిజిటల్ సర్టిఫికెట్ పొందాలనుకునేవారు ఈ మార్గదర్శకాలను పాటించాలి. ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే harghartiranga.com అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్‌లో మీ పేరు, మొబైల్ నంబర్, రాష్ట్రం, దేశం వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత జాతీయ జెండా కోడ్‌ను పాటిస్తూ, త్రివర్ణ పతాకాన్ని గౌరవప్రదంగా పట్టుకుని స్పష్టమైన సెల్ఫీ లేదా ఫోటో దిగాలి. అలా దిగిన ఫొటోను తిరంగా పోర్టల్‌లో అప్‌లోడ్ ఆప్షన్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ పక్రయను పూర్తి చేయాలి. పోర్టల్ ఇచ్చిన రేషియో అనుగుణంగా ఫొటో అప్‌లోడ్ పూర్తయితే తిరంగా.కామ్ ఆమోదించినట్టుగా మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది. ఈ ఫొటో సబ్మిషన్ ప్రక్రియ పూర్తైన అనంతరం స్క్రీన్‌పై జనరేట్ సర్టిఫికెట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తరువాత మీ పేరుతో రూపొందిన డిజిటల్ సర్టిఫికెట్ మొబైల్‌లో లాగిన్ అయితే మొబైల్ ద్వారా లేదా కంప్యూటర్‌లో లాగిల్ అయితే కంప్యూటర్ ద్వారా డౌన్‌లోడ్ అవుతుంది.
కోట్లాది మంది పాల్గొంటున్న దేశభక్తి ఉద్యమం
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ 'హర్ ఘర్ తిరంగా' ప్రచారం నేడు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రజా ఉద్యమంగా మారింది. కేంద్ర సాంస్కృతిక శాఖ లెక్కల ప్రకారం, గత 2025 ప్రచారంలో ఏకంగా 7.50 కోట్ల కంటే ఎక్కువ సెల్ఫీలు అప్‌లోడ్ కావడం విశేషం. ఈ సెల్ఫీ అప్‌లోడ్, డిజిటల్ సర్టిఫికెట్ ప్రక్రియ పూర్తి ఉచితం. ఎవరైనా డబ్బులు లేదా ఆర్థిక వివరాలు అడిగితే నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారతదేశంలో ఉన్న పౌరులతో పాటు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ పోర్టల్ ద్వారా పాల్గొనవచ్చు. మన జాతీయ జెండా పట్ల గౌరవాన్ని, దేశభక్తిని చాటుకోవడానికి ఈ డిజిటల్ గుర్తింపు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తోంది.




