Harish Rawat: పీఏ ఇంట్లో ఈడీ సోదాలు, భారీగా నగదు సీజ్.. కాంగ్రెస్ పదవులకు మాజీ సీఎం హరీశ్ రావత్ గుడ్‌బై
Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Harish Rawat: పీఏ ఇంట్లో ఈడీ సోదాలు, భారీగా నగదు సీజ్.. కాంగ్రెస్ పదవులకు మాజీ సీఎం హరీశ్ రావత్ గుడ్‌బై
Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సహాయకుడు (PA) చందన్ సింగ్ జీనా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించిన నేపథ్యంలో.. ఆయన తన రెండు కీలక పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం (PCC), కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) శాశ్వత ఆహ్వానితుడి పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ ఈ పరిణామాల వల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్‌లో 2016 నాటి సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (UKSSSC) నియామక పరీక్షలో ఓఎంఆర్ (OMR) షీట్ల మార్పిడి అక్రమాలకు సంబంధించి దెహ్రాదూన్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హరీశ్ రావత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓఎస్‌డీగా, ఆ తర్వాత పీఏగా పనిచేసిన చందన్ సింగ్ జీనా ఇంటిపై కూడా ఈ దాడులు జరిగాయి.
జీనా నివాసంలో రూ.32 లక్షల నగదు, సుమారు 200 గ్రాముల బంగారు నాణేలు, ఆభరణాలతో పాటు 12 ఖరీదైన గడియారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీనా మరియు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.52.16 లక్షలను ఫ్రీజ్ (స్తంభింపజేయడం) చేసినట్లు ఈడీ తెలిపింది.
తన పీఏపై వస్తున్న ఆరోపణలను తాను నమ్మడం లేదని, అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తని హరీశ్ రావత్ తెలిపారు. అయితే, ఈ వ్యవహాడంలో చట్టపరమైన ఆధారాలు ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.




