అంతులేని ప్రేమ.. భార్య క్యాన్సర్ చికిత్స కోసం బైకును అంబులెన్స్‌గా మార్చిన భర్త..!

Chhattisgarh: భార్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇల్లు, భూమి అమ్మేయడమే కాకుండా, తన బైకును అంబులెన్సుగా మార్చుకున్న ఒక భర్త ఆవేదన ఇది.

Arun Chilukuri
Published on: 25 April 2026 10:57 AM IST
Bike Ambulance
X

అంతులేని ప్రేమ.. భార్య క్యాన్సర్ చికిత్స కోసం బైకును అంబులెన్స్‌గా మార్చిన భర్త..!

Chhattisgarh: "కష్టాల్లో తోడుంటానని" ఏడడుగుల బంధంలో ఇచ్చిన మాటను అక్షరాలా పాటిస్తున్నాడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సమలు మరకామ్‌. థైరాయిడ్‌ క్యాన్సర్‌తో మరణంతో పోరాడుతున్న భార్యను బతికించుకోవడం కోసం అతడు పడుతున్న తాపత్రయం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు.

కబీర్‌ధామ్‌ జిల్లా అటవీప్రాంత గ్రామం నాగవాహీకి చెందిన సమలు భార్య గత రెండేళ్లుగా థైరాయిడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం తన దగ్గరున్న భూమిని, ఇల్లును, ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా సమలు అమ్మేశాడు. తరచూ ఆసుపత్రులకు తిరగాల్సి రావడంతో, అద్దె వాహనాలకు డబ్బులు లేక తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్‌గా మార్చుకున్నాడు.

ఆమెను బైకు వెనుక పడుకోబెట్టుకొని సమలు వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. మెరుగైన చికిత్స అందుతుందన్న ఆశతో ఛత్తీస్‌గఢ్ నుంచి ఏకంగా ముంబయి వరకు వెళ్లాడు. అయినా ఆమె ఆరోగ్యంలో మార్పు రాకపోవడంతో ఆ వేదన వర్ణనాతీతంగా మారింది.

గురువారం తన భార్యను బైక్ అంబులెన్స్‌పైనే కబీర్‌ధామ్‌ కలెక్టరేటుకు తీసుకువెళ్లి అధికారుల ముందు తన దీనస్థితిని వివరించాడు. సమలు బాధను చూసి చలించిన అధికారులు వెంటనే అంబులెన్సు ఏర్పాటు చేసి, ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story