Punjab Blast : రైలు పట్టాలపై బాంబుల మోత.. పంజాబ్‌లో మారణహోమానికి జరుగుతున్న ప్రయత్నం ఇవేనా?
Punjab Blast : పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో రైల్వే ట్రాక్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. వరుస పేలుళ్లతో పంజాబ్ వణుకుతోంది. ఉగ్ర కుట్ర కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Punjab Blast
Punjab Blast : పంజాబ్‌లో మరోసారి బాంబుల మోత కలకలం సృష్టించింది. పటియాలా జిల్లాలోని రాజ్‌పురా - శంభు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ (DFCCI) రైల్వే ట్రాక్ సమీపంలో అర్థరాత్రి వేళ భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ వరుస దాడులు పంజాబ్ పోలీసులకు, నిఘా వర్గాలకు పెద్ద సవాలుగా మారాయి.
రంగంలోకి భద్రతా బలగాలు
పేలుడు సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రతా దళం (RPF), జీఆర్పీ (GRP), స్థానిక పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, ఇది కేవలం ప్రమాదం కాదని, దేశ భద్రతకు ముప్పు కలిగించే పెద్ద కుట్రలో భాగమని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేసిన భద్రతా సంస్థలు, ఆధారాల కోసం గాలిస్తున్నాయి.
వరుస ఘటనలతో ఆందోళన
పంజాబ్‌లో గత కొన్ని రోజులుగా ఇలాంటి అనుమానాస్పద ఘటనలు పెరగడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మొన్న చండీగఢ్‌లోని బీజేపీ కార్యాలయం బయట పార్కింగ్‌లో పేలుడు జరగగా, తాజాగా పటియాలాలో రైల్వే ట్రాక్ వద్ద బ్లాస్ట్ అయింది. అటు గురుదాస్‌పూర్‌లోని గీతా మందిర్ రోడ్డులో కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి విస్ఫోటనం లాంటి వస్తువును పడవేసి వెళ్లారు. ఎస్పీ డీకే చౌదరి నేతృత్వంలో పోలీసులు ఆ వస్తువు అసలు పేలుడు పదార్థమేనా కాదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ ఘోర ప్రమాదాలు
రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడం పంజాబ్‌లో కొత్తేమీ కాదు. కొద్ది నెలల క్రితం ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సర్హింద్ ప్రాంతంలో ఇలాంటి పేలుడే జరిగింది. ఆ ఘటనలో దాదాపు 15 అడుగుల మేర రైల్వే ట్రాక్ తునాతునకలై ఎగిరిపోయింది. అప్పట్లో అక్కడి నుంచి వెళ్తున్న గూడ్స్ రైలు ఇంజిన్ కూడా దెబ్బతిని, లోకో పైలెట్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా పటియాలాలో జరిగిన పేలుడు కూడా అదే తరహాలో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ముమ్మరంగా దర్యాప్తు
ఈ పేలుళ్ల వెనుక ఖలిస్థానీ సానుభూతిపరులు లేదా సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా అనే కోణంలో కేంద్ర నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి. ముఖ్యంగా డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ వంటి కీలకమైన ఆర్థిక వ్యవస్థ మార్గాలను దెబ్బతీయడం ద్వారా దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని కుట్ర చేస్తున్నట్లు సమాచారం. పంజాబ్ వ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.




