India Post Drone : దేశంలోనే ఫస్ట్ టైం.. హిమాచల్ ప్రదేశ్‌లో డ్రోన్ పోస్ట్ సర్వీస్ షురూ.. దాని ప్రత్యేకత ఇదే

India Post Drone : హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో తపాలా శాఖ డ్రోన్ల ద్వారా ఉత్తరాలు, పార్సిళ్లను పంపిణీ చేసే చారిత్రాత్మక సేవలను ప్రారంభించింది. గంటల ప్రయాణం కేవలం 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

CR Reddy
Published on: 14 Jun 2026 9:46 AM IST
India Post Drone
X

India Post Drone

India Post Drone : భారత తపాలా శాఖ సాంకేతిక రంగంలో ఒక సరికొత్త విప్లవానికి తెరతీసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత ఎత్తైన, దుర్ఘటమైన కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలకు వేగంగా సేవలు అందించడానికి డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. పర్వత ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని చోట్ల గంటల కొద్దీ సమయం తీసుకునే పోస్టల్ డెలివరీని కేవలం నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు ఈ చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని మండీ జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన డ్రోన్ పోస్టల్ డెలివరీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హర్షం

ఈ అద్భుతమైన టెక్నాలజీ విజయంపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ-రెహార్‌ధార్ మార్గంలో డ్రోన్ ఆధారిత పోస్టల్, పార్సిల్ డెలివరీ సేవలను ప్రారంభించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. గతంలో రోడ్డు మార్గంలో వెళ్లడానికి గంటల సమయం పట్టేదని, అయితే ఇప్పుడు రియల్ టైమ్ ట్రాకింగ్ సాయంతో డ్రోన్ కేవలం 7 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్‌తో డిజైన్

పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఈ వినూత్న ప్రాజెక్టును కేవలం ఉన్నతాధికారుల ఆలోచనలతోనే కాకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల సలహాల మేరకు రూపొందించారు. గ్రామీణ డాక్ సేవకులు, పోస్టల్ అసిస్టెంట్లు తమ రోజువారీ విధుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, వారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ డ్రోన్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా, భారతదేశంలోని మారుమూల గ్రామాలను సైతం దేశ ఆర్థిక ప్రగతి, వేగవంతమైన సేవలతో అనుసంధానించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.

12 కిలోమీటర్ల దూరం.. కేవలం 6 నిమిషాల్లోనే

ఈ ప్రాజెక్టును భారత తపాలా శాఖ మరియు ప్రైవేట్ డ్రోన్ తయారీ సంస్థ స్కై ఎయిర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. శుక్రవారం (జూన్ 12) నిర్వహించిన తుది పరీక్షల్లో భాగంగా డ్రోన్ మండీ ప్రధాన పోస్ట్ ఆఫీస్ నుంచి విలువైన ప్రభుత్వ పత్రాలు, పార్సిళ్లతో గాల్లోకి ఎగిరింది. ద్రంగ్ ప్రాంతంలోని రెహడ్‌ధార్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌కు సురక్షితంగా చేరుకొని పార్సిళ్లను డ్రాప్ చేసింది. మండీ పోస్టల్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు మార్గంలో దాదాపు రోజంతా పట్టే 12 కిలోమీటర్ల కొండల ప్రయాణాన్ని ఈ డ్రోన్ కేవలం 6 నిమిషాల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది.

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న స్కై ఎయిర్ సేవలు

ప్రస్తుతం ఈ మెయిల్ రవాణా కోసం ఉపయోగిస్తున్న అత్యాధునిక డ్రోన్లు ఒకేసారి 10 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలవు. అలాగే ఇవి ఒకే ఛార్జ్‌పై 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించగలవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 150 ప్రాంతాలలో స్కై ఎయిర్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ డ్రోన్ పోస్టల్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి మండీ జిల్లాలో 10 ముఖ్యాంశ ప్రాంతాలను ఈ ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చారు. అక్కడ ప్రస్తుతం 8 డ్రోన్ల సహాయంతో తపాలా సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story