హిమాచల్‌ ప్రదేశ్‌లో తొలి గాడిద పాల పెంపకం కేంద్రం.. లీటరు రూ. 7,000!

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిల్లాస్పూర్ జిల్లాలో రాష్ట్ర తొలి వ్యవస్థీకృత గాడిద పెంపకం కేంద్రం (Donkey Farm) ప్రారంభమైంది.

G Krishna
Published on: 18 Nov 2026 9:36 PM IST
Himachal Pradesh
X

హిమాచల్‌ ప్రదేశ్‌లో తొలి గాడిద పాల పెంపకం కేంద్రం.. లీటరు రూ. 7,000!

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిల్లాస్పూర్ జిల్లాలో రాష్ట్ర తొలి వ్యవస్థీకృత గాడిద పెంపకం కేంద్రం (Donkey Farm) ప్రారంభమైంది. కంద్రౌర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్యామ్‌లో గాడిద పాలను లీటరు రూ. 7,000 ప్రీమియం ధరకు విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారు. పశుసంవర్ధక రంగంలో ఇదొక వినూత్న వ్యాపార అవకాశమని, ఫార్మాస్యూటికల్స్, స్కిన్‌కేర్ పరిశ్రమల్లో దీనికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రి రాజేష్ ధర్మాని ఈ ఫారమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

డైరికా ఫార్మ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు

'డైరికా ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ ఈ వెంచర్‌ను ప్రారంభించింది. సంజీవ్ సింగ్ ఠాకూర్ స్థాపించిన ఈ సంస్థకు సీరత్ టూర్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఇప్పటికే సాధారణ పాల ఉత్పత్తి, సేకరణ , మార్కెటింగ్‌లో ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు గాడిద పెంపకం , పాల ఉత్పత్తి రంగంలోకి విస్తరిస్తోంది. ఇది యువతకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు వాణిజ్యపరంగా వృద్ధి చెందేందుకు మంచి అవకాశమని మంత్రి రాజేష్ ధర్మాని అభిప్రాయపడ్డారు. అయితే, దీనిని స్థిరమైన వ్యాపారంగా మలచడానికి మరింత శాస్త్రీయ పరిశోధనలు అవసరమని ఆయన నొక్కిచెప్పారు.

గాడిద పాలు ఎందుకు అంత ప్రియమైనవి?

ఫార్మాస్యూటికల్, చర్మ సంరక్షణ (స్కిన్‌కేర్) పరిశ్రమల్లో గాడిద పాలకు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉంది. వీటిలో ల్యాక్టోస్, వే ప్రొటీన్లు, లైసోజైమ్, లాక్టోఫెరిన్ వంటి బయోయాక్టివ్ భాగాలు ఉంటాయి. అనేక దేశాల్లో కొన్ని రకాల కాస్మెటిక్స్, ప్రీమియం ఉత్పత్తుల తయారీలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. హిమాచల్‌లో గాడిద పాల వాణిజ్య సామర్థ్యాన్ని అంచనా వేయడానికి శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యతా పరీక్షలు, ప్రాసెసింగ్ సౌకర్యాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు.

స్థానిక 'స్పితి' జాతి గాడిదల పెంపకం

భారతదేశంలో గాడిదల జనాభా క్రమంగా తగ్గిపోతుండటంపై ఆందోళన చెంది ఈ వెంచర్‌ను ప్రారంభించినట్లు సహ వ్యవస్థాపకురాలు సీరత్ టూర్ తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన స్థానిక 'స్పితి' గాడిద జాతిని ఉపయోగించి ఈ పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని స్థానిక జాతిని ప్రోత్సహించడంతో పాటు, గాడిద పాల వ్యాపార అవకాశాలను అన్వేషించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుక్కు నేతృత్వంలోని ప్రభుత్వం రైతులు, పశుపోషకుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తోందని మంత్రి ధర్మాని తెలిపారు. ఆధునిక సాంకేతికత, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే డైరికా ఫార్మ్స్ రోజువారీగా 2,700 లీటర్లకు పైగా పాలను సేకరిస్తూ, చుట్టుపక్కల ప్రాంతాల పశుపోషకులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోందని వ్యవస్థాపకులు తెలిపారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.